కొన్ని కొన్ని మాటలు.. కాస్త గట్టిగానే తగులుతుంటాయ్ రాజకీయాల్లో.! ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాటలు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి గట్టిగా తగిలాయ్. వరాహి అనే లారీ ఎక్కి.. ఊగిపోతుంటాడు దత్త పుత్రుడు.. అంటూ మొన్నీమధ్యనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విమర్శించేసరికి, భీమవరం వారాహి యాత్రలో జనసేనాని ‘ఊపుడు’ లేకుండానే పని కానిచ్చేశారు.
నిజానికి, వైఎస్ జగన్ వల్ల జనసేనానికి కలిగిన మంచి ఇది.! పవన్ కళ్యాణ్ ఊగిపోవడాన్ని జనసేన మద్దతుదారులే చాలామంది జీర్ణించుకోలేరు. సాధారణ ప్రజానీకం సంగతి సరే సరి.
భీమవరంలో జనసేనాని సభ ప్రశాంతంగా సాగింది. జనసందోహం మామూలే.! ప్రసంగం కూడా పద్ధతిగా సాగింది. కాకపోతే, ‘మిస్టర్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి’ అనీ, ‘జగన్’ అనీ పవన్ కళ్యాణ్ మాట్లాడటం, వైసీపీ అభిమానులకు కొంత ఆగ్రహాన్ని తెప్పిస్తుందనుకోండి.. అది వేరే సంగతి.
అభిమానులు సైలెన్సర్లు లేకుండా వాహనాలు నడిపితే సమర్థించనంటూనే, వైసీపీ నేతల నోళ్ళకు లేని సైలెన్సర్లు.. మా పార్టీ కార్యకర్తలు, అభిమానుల వాహనాలకెందుకు.? అని జనసేనాని ప్రశ్నించడం అమాయకత్వం. ఉద్దేశ్యం ఏదైనా, అది సమర్థనీయం కాదు. సౌండ్ పొల్యూషన్ అది.
ఇక, తన వ్యక్తిగత జీవితం గురించి ముఖ్యమంత్రి పదే పదే విమర్శించడాన్ని జనసేనాని తీవ్రంగా తప్పు పట్టారు. ‘నా వెంట్రుకతో సమానం..’ అంటూనే, ‘మీ జీవితాల్ని బయటపెట్టడం పెద్ద కష్టమేం కాదు నాకు..’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ‘పైగా, నేను వాటి గురించి చెప్పడం మొదలు పెడితే, మీ చెవుల్లోంచి రక్తాలొస్తాయ్..’ అని కూడా హెచ్చరించారు జనసేనాని.