చంద్రబాబుకు చీటర్ అవార్డు

చంద్రబాబునాయుడు బెస్ట్ చీటర్ అవార్డు ఇవ్వాలంటూ జగన్మోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. విజయనగరం జిల్లాలోని గజపతిరనగరంలో పాదయాత్రలో భాగంగా బహిరంగసభ నిర్వహించారు. ఆ సందర్భంగా జగన్ మాట్లాడుతూ వ్యవసాయమే దండగన్న వ్యక్తిగా ఉత్తమ అవార్డా ? అంటూ మండిపడ్డారు. అది కూడా బిజెపి మంత్రి చేతులమీదుగా అవార్డు ప్రధానం చేయటమా ? అంటూ ధ్వజమెత్తారు. వ్యవసాయమే దండగని, వ్యవసాయ రంగాన్ని ఏమాత్రం ప్రోత్సహించని వ్యక్తికి వ్యవసాయ రంగంలో సేవలు చేశారని అవార్డు ఇవ్వటమేంటని ఎంపిక చేసిన స్వామినాథన్ కమిటీని నిలదీశారు.

 

నిజానికి జగన్ అన్నదాంట్లో తప్పేమీ లేదు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ఒకపుడు రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తానంటే అవహేళనగా మాట్లాడారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు కడితే డబ్బు దండగన్నది కూడా చంద్రబాబే. సబ్సిడీలను పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు చంద్రబాబు తాను రాసిన పుస్తకంలో స్పష్టంగా చెప్పారు. మొదటి సారి ముఖ్యమంత్రైనపుడు చంద్రబాబు వ్యవసాయ రంగాన్ని పెద్దగా పట్టించుకోలేదు. పైగా వ్యవసాయరంగానికి ప్రత్యామ్నాయంగా ఐటి రంగాన్ని ప్రోత్సహించారు.

 

అప్పట్లో వ్యవసాయరంగంపై పెద్దగా దృష్టి పెట్టలేదు కాబట్టి ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టును కూడా నిర్మించలేదు. నిర్మాణంలో ఉన్న వాటికి కూడా పెద్దగా నిధులు కేటాయించింది లేదు. అందుకే రైతులు అప్పట్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు. ఇవన్నీ వాస్తవాలే. వైఎస్ ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణానికి, వ్యవసాయరంగానికి పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. చంద్రబాబు పాలన చూశారు కాబట్టే పదేళ్ళు ప్రతిపక్షంలోనే కూర్చోబెట్టారు జనాలు.

 

దాంతో విషయం అర్ధమైన చంద్రబాబు రైతుల మద్దతు లేకపోతే అధికారంలోకి రావటం కష్టమని గ్రహించారు. అందుకే పోయిన ఎన్నికల్లో నోటికొచ్చిన వాగ్దానాలు చేశారు. సరే, మూడోసారి సిఎం కాగానే మళ్ళీ పాత చంద్రబాబు నిద్రలేచాడు. వాస్తవాలు ఈ విధంగా ఉంటే చంద్రబాబుకు  స్వామినాధన్ కమిటి ఎంపిక  చేయటం అందరికీ ఆశ్చర్యంగానే ఉంది. ఆ విషయాన్నే జగన్ పాదయాత్రలో ప్రశ్నించారు.