లాక్ డౌన్ మొత్తం ఏడు నెలల పాటు టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు హైదారబాద్లోనే ఉండిపోయారు. పెద్ద వయసు కావడంతో బయటికి వస్తే రిస్క్ అని భావించి ఇంటి నుండే పార్టీని నడిపారు. అంతా వీడియో కాన్ఫరెన్సుల ద్వారానే జరిగేలా చూశారు. శ్రేణులతో, నాయకులతో జూన్ యాప్ ద్వారా టచ్లో ఉంటూ కష్టం మీద నెట్టుకొచ్చారు. చివరికి పార్టీకి ప్రతిష్టాత్మకమైన మహానాడు కార్యక్రమాన్ని కూడ ఆన్ లైన్ ద్వారానే జరుపుకున్నారు. దీంతో ప్రతిపక్షాల నుండి జూమ్ బాబు అనే పేరును తెచ్చుకున్నారు. ఇలా లాక్ డౌన్ కారణంగా నానా ఇబ్బందులుపడిన ఆయన మెల్లగా పరిస్థితులు నార్మల్ అవుతుండటంతో పూర్తిస్థాయిలో బయటకురావాలని అనుకున్నారు.
లాక్ డౌన్ సమయంలో బయటికొచ్చి ప్రభుత్వం మీద పోరాడే అవకాశం లేకపోవడంతో చాలా మంది సందర్భాలను కోల్పోయారు ఆయన. సుమారు ఏడు నెలల సమయం అలాగే వృథా పోయింది. అందుకే బయటికొచ్చాక యుద్ధం చేయాలని నిర్ణయానికి వచ్చారు. ఇందుకోసం ఆయన పలు ప్రధాన అంశాలను ఎంచుకున్నారు. ఏడాదిగా సాగుతున్న అమరావతి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని, పోలవరం విషయంలో కేంద్రంపై ప్రభుత్వం ఎదురుదాడికి దిగాలని డిమాండ్ చేయడం, పోలవరాన్ని 70 శాతం పూర్తి చేసింది తామేనని జనానికి నమ్మకం కలిగేలా చేయడం, ఆ ప్రాజెక్ట్ విషయంలో జగన్ మోసం చేస్తున్నారనే అభిప్రాయాన్ని ప్రజలకు కలిగేలా చేయడం, తన హయాంలో కట్టామని చెప్పుకుంటున్న ఇళ్లను బలవంతంగానైనా ప్రజలకు పంచడం ఇలా పెద్ద లిస్ట్ ఒకటి తయారు చేసుకున్నారు.
అందుకే ఆఘమేఘాల మీద పార్టీలో పెద్ద ఎత్తున పదవులను భర్తీ చేశారు. ఎక్కడికక్కడ నాయకులకు బాధ్యతలు అప్పగించేశారు. స్తబ్దుగా ఉన్న లీడర్లను యాక్టివ్ స్టేజీలోకి తీసుకొచ్చారు. అంతా సిద్ధం చేసి బయటికి వద్దామనుకునేలోపు జగన్ ఆయన ఇంటికి తాళాలు వేసేశారు. ప్రధానమైన పోలవరం ప్రాజెక్ట్ విషయంలో జగన్ 2022 నాటికి పూర్తిచేసి తీరుతామని హామీ ఇచ్చారు. పనులు చూసుకుంటున్న సంస్థ కూడ 2021నాటికి ప్రాజెక్ట్ పూర్తవుతుందని ధీమాగా చెబుతోంది. అంతటితో పోలవరం సమస్య కొద్దిగా తగ్గుముఖం పట్టింది. అలాగే టిడ్కొ ఇళ్లను కూడ డిసెంబర్ 25న పంచేస్తామని, ఉచిత ఇళ్ల పట్టాలను ప్రజలకు అందిస్తామని చెప్పేశారు.
ఇక చంద్రబాబు బోలెడు ఆశలు పెట్టుకున్న అమరావతి ఉద్యమం మీద కూడ జగన్ నీళ్లు చల్లేశారు. టీడీపీ ఆధ్వర్యంలో అమరావతికి అనుకూలంగా నిరసనలు నడుస్తుంటే మూడు రాజధానులే కావాలని కొత్తగా కొందరు ఉద్యమకారులు పోరాటం స్టార్ట్ చేశారు. వారిని పురామాయించింది ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అంతేకాదు రాయలసీమ, కోస్తాలలో జనాలను చంద్రబాబుకు వ్యతిరేకంగా తిప్పేశారు. ఇలా చంద్రబాబు చేద్దామనుకున్న అన్ని పనులకు వ్యతిరేక వాతావరణాన్ని సృష్టించి పెట్టారు. దీంతో చంద్రబాబు బయటికొచ్చి ఎంత వీరంగం చేసినా వృథా ప్రయాసే అవుతుంది తప్ప ఫలితరం దక్కేలా కనబడట్లేదు.