ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన ఆదేశాలను బేఖాతరు చేస్తే ఎంతటివారికైనా ట్రీట్మెంట్ ఇచ్చేస్తుంటారు. ఏ విషయమం మీదైనా ఆయన బ్రీఫింగ్ ఇచ్చి పంపారంటే ఆ ప్రకారమే జరిగితీరాలి. అలా జరక్కపోతే పరిణామాలు వేరే ఉంటాయి. అవతలి వారు ఎంత పెద్దవారైనా నిలదీస్తారు జగన్. ప్రజెంట్ అలాంటి సీనే ఒకటి జరిగిందట వైసీపీలో. రాష్ట్రంలోని కార్పొరేషన్లకు చైర్మన్, డైరెక్టర్ పదవులను భర్తీ చేయాలని జగన్ నిర్ణయించారు. ఈ పదవుల మీద చాలామంది నేతలు ఆశలు పెట్టుకున్నారు. కొందరికి నేరుగా వైఎస్ జగన్ నుండి హామీ అందితే ఇంకొందరికి ఇతర సీనియర్ లీడర్లు హామీలు ఇచ్చారు. వైఎస్ జగన్ ఏమో అన్ని నియోజకవర్గాలను క్షుణ్ణంగా పరిశీలించి, స్థానిక ఎమ్మెల్యేలు, లీడర్ల అభిప్రాయం తీసుకుని పదవులకు ఎవరు అర్హులో ఒక జాబితా తయారుచేయాలని అనుకున్నారు.
ఈ బాధ్యతను సీనియర్ నేతలు, తనకెంతో సన్నిహితమైన నాయకులకు అప్పగించారట. అన్ని స్థాయిల లీడర్ల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని, పార్టీ కోసం నిజాయితీగా కష్టపడి పనిచేసిన వారికి ప్రాధాన్యం ఇస్తూ పదవులు ఇవ్వవలసిన వారి జాబితా రూపొందించమని తెలిపారట. కానీ కొన్ని నియోజకవర్గాల నుండి ముఖ్యమంత్రికి పిర్యాధులు అందాయట. తమ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల అభిప్రాయాలను తీసుకోకుండా బలవంతపు పెత్తనం చేస్తున్న నేతల అభిప్రాయాలను మాత్రమే తీసుకున్నారని కంప్లైంట్స్ వెళ్లాయట. ముఖ్యంగా ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాల నుండి పిర్యాధులు వెళ్లడంతో జగన్ సీరియస్ అయ్యారట.
ఎందుకంటే గత ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గాల వారు వైసీపీకి సంపూర్ణ మద్దతు ఇచ్చారు. అందుకే జగన్ వారికి పదవుల్లో, పార్టీలో సముచిత స్థానం ఇవ్వాలని ఆనాడే నిర్ణయించున్నారు. కానీ నామినేటెడ్ పదవుల భర్తీలో వారి పట్ల నిర్లక్ష్యం కనిపించడంతో జగన్ తట్టుకోలేకపోయారట. పైగా నామినేటెడ్ పదవులకు మహిళలకు సింహ భాగం ఇవ్వాలని, ఆ విధంగా లిస్ట్ తయారుచేయమని ముందే చెప్పారట. కానీ సీనియర్లు ఇచ్చిన జాబితాలో మహిళలకు చోటు పెద్దగా లేకపోవడం ఆయనకు మరింత ఆగ్రహాన్ని తెప్పించిందట. దీంతో సొంత నిర్ణయాలు వద్దని, చెప్పినట్టు చేస్తే చాలని సదరు నేతలకు మొహమాటం లేకుండా చెప్పిన జగన్ మళ్లీ కొత్త జాబితా రూపొందించమని పాత జాబితాను వెనక్కుపంపారని రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తోంది. నమ్మినవారికి అన్యాయం జరిగితే జగన్ చూస్తూ ఊరుకోరు కదా.