తెలుగు రాజకీయాల్లో పొలిటికల్ పార్టీలు, నాయకులే కాదు మీడియా సంస్థలు కూడ ప్రముఖ పాత్ర పోషిస్తుంటాయి. ఈ మీడియా కూడ పొలిటికల్ పార్టీల మధ్య ముక్కలుగా చీలిపోయింది. వాటిలో ఒకటి చంద్రబాబు నాయుడు, టీడీపీకి కొమ్ముకాసే ఎల్లో మీడియా ఒకటైతే వైఎస్ జగన్, వైసీపీకి అనుకూలంగా వ్యవహరించే బ్లూ మీడియా ఒకటి. ఈ బయాస్డ్ పద్దతికి శ్రీకారం చుట్టింది అయితే మాత్రం చంద్రబాబు నాయుడనే అనాలి. ఛానెల్, పత్రికను ఒక కవచంలా వాడుకోవడంలో బాబుగారిని మించిన వ్యక్తి లేరు.
ఎల్లో మీడియాగా ముద్రపడిన రెండు ప్రధాన పత్రికలు ఏళ్ల తరబడి చంద్రబాబును మోస్తూనే ఉన్నాయి. ఆయన్ను మోస్తే పర్వాలేదు. కానీ అవతలివారిని తొక్కేసే ప్రయత్నం బాగా చేశారు. అంతెందుకు 2019 ఎన్నికల సమయంలో వైఎస్ జగన్ మీద చంద్రబాబు అనుకూల మీడియా ఎంతలా విషం చిమ్మిందో అందరికీ తెలుసు. చంద్రబాబు పాలనను హైలెట్ చేస్తూ జగన్ వస్తే ఫ్యాక్షనిస్టు తరహా పాలన తప్ప ఏమీ ఉండదని ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేశారు. కానీ జగన్ ఏమాత్రం తొణక లేదు. ప్రజలు సైతం ఎల్లో మీడియా రాతలను చదివి చదివి విసిగిపోయి ఆ విముఖతను ఎన్నికల్లో బాబుగారి మీద చూపించారు.
ఇంకేముంది.. టీడీపీ 23 స్థానాలకే పరిమితమై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. అయినా ఆయన అస్మధీయ మీడియాకు బుద్ది రాలేదు. జగన్ సీఎం అయిన ఆరంభం నుండి ఆయన మీద బురద చల్లడానికి ఎల్లో మీడియాలో భాగమైన ఒక ఛానెల్, పత్రిక గట్టిగా ట్రై చేస్తుండగా అదే ఎల్లో మీడియాలో భాగమైన ఒక పత్రిక మాత్రం పద్దతిని మార్చుకుంది. గత ఎన్నికల ప్రభావమో, జనం నుండి వ్యక్తమవుతున్న విముఖతో కానీ సదరు జగన్ మీద అదే పనిగా నెగెటివీ ప్రచారం చేయడం మానుకుంది. మెల్లగా జగన్ చర్యల్లో, నిర్ణయాల్లో ఉన్న మేలును గుర్తించడం మొదలుపెట్టింది. ఈ మార్పు ఏదో ఒక్కరోజు మార్పు కాదు కొంత కాలంగా అలాగే సాగుతోంది. సదరు పత్రిక వరుసగా జగన్ పాలన మీద పాజిటివ్ ధోరణి కనబరుస్తోంది. దీన్నిబట్టి ఆ మీడియా ఎల్లో మీడియ నుండి చీలిపోయి జగన్ పక్షాన చేరిందా అనిపిస్తోంది.