చంద్రబాబు నాయుడుకు అనుకూలంగా వ్యహరించే ఈనాడు చంద్రబాబు చేసే పనుల్లోని మంచిని జల్లెడపట్టి అతికష్టం మీద పట్టుకుని వాటినే భూతద్దంలో చూపిస్తుంటుంది. చేసింది రవ్వంత అయితే దాన్ని కొండంతలా చేసి చెబుతూ జనాన్ని మభ్యపెట్టడంలో ఆ ఎల్లో పత్రికది అందెవేసిన చేయి. అయితే ఈ పని అనుకున్నంత సులువు కాదు. ఈ సంగతిని ఈమధ్య ఈనాడు పత్రిక వ్యవహరిస్తున్న తీరు చూస్తే అర్థమవుతుంది. జగన్ విషయంలో చిన్న పొరపాటు దొరికినా ఫ్రంట్ పేజీలో వేసి పెద్ద ఎడిటోరియల్ రాసేసి చివరగా ప్రభుత్వ విధానాలు తప్పుగా ఉన్నాయని తేల్చడం చేస్తుంటుంది. అదే చంద్రబాబుగారి పాలనలో చెప్పడానికి మంచి ఏదైనా దొరికితే దాన్ని ధూమ్ ధామ్ చేస్తారు. ఒకవేళ మంచి దొరక్క తప్పులే కుప్పలు తెప్పలుగా ఉంటే మాత్రం జనం దృష్టిలో తమ రెప్యుటేషన్ దెబ్బతినకుండా ఆ తప్పుల్ని అతికష్టం మీద సరళమైన రీతిలో చూపిస్తుంటారు.
పథకం అమలులో ఘోర వైఫల్యం :
పెద్ద పెద్ద సంగతులను కూడ ఎక్కడో మధ్య పేజీల్లో విసిరేసి జనం దృష్టి వాటి మీద పెద్దగా పడకుండా జాగ్రత్తపడుతుంటారు. సరిగ్గా అలాంటి పనే ఇప్పుడు చేసింది ఈనాడు. తాజాగా కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) చంద్రబాబు పాలన మీద అనేక అంశాల్లో కంప్లీట్ నివేదికను తయారుచేసింది. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన ప్రాజెక్టుల ఎంపిక, అమలు తీరు ఉండాల్సిన రీతిలో లేదని తేల్చింది. కేటాయించిన నిధులను సకాలంలో ఖర్చు చేయలేదని తేల్చింది. ఈ పథకం ప్రధానంగా రైతుల కోసం ఏర్పాటు చేసింది. కానీ వారి ప్రయోజనాలకు అనుకూలంగా పథకాలను అమలుచేయలేదట. 2014- 18 మధ్యన ఆర్కేవీవై అమలుకు 1302.63 కోట్లు కేటాయిస్తే 2018 మార్చి వరకు 1116.19 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఆర్కేవీవై నిబంధనలకు విరుద్దంగా నిధులను మళ్లించారని కూడ తేల్చింది.
మద్యం సిండికేట్లు, దేవుడి పేరుతో శఠగోపం :
ఎక్సైజ్ శాఖలో జరిగిన అవినీతిని సైతం కాగ్ ఎత్తిచూపింది. మద్యం సిండికేట్లకు అనుకూలంగా వ్యవహరించి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టినట్లు కాగ్ తేల్చింది. రాష్ట్ర ఎక్సైజ్ శాఖలో ఆడిట్ చేయాల్సిన కార్యాలయాలు 103 ఉండగా 2017–18 ఆర్థిక సంవత్సరంలో కాగ్ 14 కార్యాలయాలను మచ్చుకు తనిఖీ చేసింది. మొత్తం 41 కేసుల్లో రూ.6.71 కోట్ల మేర ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టినట్లు నిర్ధారించింది. 2014–2018 కాలంలో వివిధ ఆలయాలకు చెందిన దేవుళ్ల నిధులను ప్రభుత్వ అధికారులు ఉపయోగించే కార్లకు ప్రెటోలు ఖర్చుకు.. తమకు నచ్చిన కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులకు గ్రాంట్ రూపంలో ఆర్ధిక సహాయం చేసేందుకు మళ్లించినట్టు స్పష్టం చేసింది. రూ.34.07 కోట్ల మేర ప్రైవేట్ ఆసుపత్రులకు ఇచ్చిన నిధులకు సంబంధించి రికార్డుల్లో ఎటువంటి వివరాలు లేవని తేల్చారు. దేవుడికి చెందిన వ్యవసాయేతర భూమి ఆక్రమణకు గురైందని గుర్తించింది.
ఇలా పలు అంశాల్లో చంద్రబాబు పాలనలో అనేక రకాల అవకతవకలు జరిగినట్టు కాగ్ నివేదికలు చెబుతున్నాయి. ఈ నివేదికను నిర్లక్ష్యం చేయడం వీలుకాదు. బాబు వ్యతిరేక మీడియాలో ఈ సంగతులు గొప్పగా ఎలివేట్ అయ్యాయి. కాబట్టి ఎల్లో మీడియాలో బయటపెట్టకుండా ఉంటే జనం తిట్టిపోస్తారు. అందుకే జనం దృష్టిని ఆకర్షించని రీతిలో ఎక్కడో రెండు మధ్య, చివరాఖరి పేజీల్లో ఈ నివేదికను సరళమైన రీతిలో ప్రచురించి మిన్నకుండిపోయింది.