2019 ఎన్నికల్లో బంపర్ విక్టరీ కొట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, అంతకు మించిన విజయాన్ని వచ్చే ఎన్నికల్లో.. అంటే 2024 ఎన్నికల్లో అందుకుంటామని అంటోంది. ‘వై నాట్ 175’ అనే లక్ష్యంతో వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యూహ రచన చేస్తున్న సంగతి తెలిసిందే.
175 సీట్లు ఎలా సాధ్యం.? అన్నది ఓ చర్చ. ఆ నెంబర్ ఫిక్స్ చేసుకుంటే, 2019 ఎన్నికల్లో సాధించిన సీట్ల కంటే ఒక్కటైనా ఎక్కువ కొట్టగలమన్నది వైఎస్ జగన్ వ్యూహం కావొచ్చు. కాగా, 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయ తెర నుంచి టీడీపీ మాయమైపోతుందన్నది ఓ అంచనా. వైఎస్సార్సీపీ వ్యూహం కూడా ఇదే. టీడీపీ – జనసేన కలవకుండా వుంటే, జనసేన ప్రతిపక్షంగా వుంటుంది.. టీడీపీ పూర్తిగా గల్లంతవుతుంది. అప్పుడు వైసీపీ వ్యతిరేక ఓటు చీలుతుంది గనుక, వైసీపీ ఎలాంటి ఇబ్బందీ లేకుండా అధికార పీఠమెక్కుతుంది.
ఇదిలా వుంటే, వైసీపీ నుంచి కొందరు ప్రజా ప్రతినిథులు పక్క పార్టీల వైపు చూస్తున్న మాట వాస్తవం. ఆ లిస్టులో ఆనం రామనారాయణరెడ్డి, మేకతోటి సుచరిత తదితరులున్నారు. ఇలాంటోళ్ళు ఏకంగా 30 నుంచి 40 మంది వరకు వైసీపీలో వున్నారట. వాళ్ళకెలాగూ టిక్కెట్లు ఇంకోసారి వచ్చే అవకాశం లేదని తేలిపోవడంతో.. వాళ్ళంతా తమ జాగ్రత్తల్లో తాము వుంటున్నారు.
నిజానికి, ఇలాంటి టిక్కెట్లు ముందే జారిపోతే.. అంటే వేరే పార్టీల్లోకి వెళ్ళిపోవడమే వైసీపీకి అడ్వాంటేజ్. ఆయా నియోజకవర్గాల్లో కొత్త నాయకత్వం తయారవుతుంది. ఆ దిశగా వైఎస్ జగన్ అతి త్వరలోనే కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. మొత్తంగా ఓ నలభై ఐదు మంది వరకూ అలాంటోళ్లు వున్నారనీ, విడతల వారీగా వేటు పడుతుందనీ సమాచారం.