థాంక్స్… పవన్ కు ఆఫ్ ది రికార్డ్ చెబుతోన్న వైసీపీ!

గడిచిన ఎన్నికల్లో వైఎస్ జగన్ విజయానికి.. ఆయనపై ప్రజలు పెట్టుకున్న బలం ఒకెత్తు అయితే.. చంద్రబాబు పై ఉన్న అపనమ్మకం మరో బలం అని అనే విశ్లేషణ ఒకటి ఉంది! ప్రజలకు జగన్ పై ఉన్న నమ్మకానికితోడు చంద్రబాబుపై ఉన్న ఆగ్రహం కూడా వైసీపీ భారీ విక్టరీకి కారణం అని చెబుతుంటారు. ఈ సమయంలో ఆ బాధ్యత పవన్ కూడా తీసుకున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

అవును… జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ చేస్తున్న వారాహి యాత్ర 3.0పై పార్టీ నాయ‌కులు.. అభిమానుల అభిప్రాయాలు ఎలా ఉన్నా.. సాధార‌ణ ప్ర‌జానీకంలో మాత్రం దీనిపై మ‌రో విధంగా చ‌ర్చ సాగుతోంది. వారాహి యాత్ర ద్వారా ప‌వ‌న్ చెప్పాల‌ని అనుకుంటున్న విష‌యం ఏంటి అనేది ఇప్పటికీ ఒక క్లారిటీ రావ‌డం లేద‌ని అంటున్నారు. ఇప్పటి వ‌ర‌కు ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో యాత్ర చేసిన ప‌వ‌న్‌.. ప్రస్తుతం విశాఖలో పర్యటిస్తున్నారు.

ఈ సందర్భంగా పవన్ నాడు నేడు చెప్పిన మాట ఒకటే… జగన్ ని గద్దె దించడమే తన లక్ష్యం అని. అది లక్ష్యం కాకూడదు అనేది విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది. కారణం… త‌న వ్యక్తిగ‌త అజెండా కేవ‌లం జ‌గ‌న్‌ ను అధికారం నుంచి దించ‌డ‌మే అయితే.. ఇంత‌గా ప్రయాస ప‌డాల్సిన అవసరం లేదనేది పలువురి అభిప్రాయంగా ఉంది.

జగన్ కు వ్యతిరేకంగా ఓటు వేయండి అని ఎన్నిక‌ల స‌మ‌యంలో తన అభిమానులకు పవన్ ఒక పిలుపు ఇస్తే స‌రిపోతుందిగా అని మెజారిటీ ప్రజ‌లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. దీనికోసం యాత్రలు, ర్యాలీలు, ఫలితంగా ప్రజలను ఇబ్బంది పెట్టడాలు, వాలంటీర్లపై అవాకులూ చెవాకులూ పేలడాలు ఎందుకని అంటున్నారు. కారణం… తాను వస్తే ఏమి చేస్తాను అనే విష్యం మాత్రం పవన్ ఇప్పటికీ ఒక్కమాట కూడా స్పష్టంగా చెప్పలేదు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ‌ను గెలిపిస్తే.. ఇది చేస్తాం.. అది చేస్తాం.. అని చెప్పాలి. అదే స‌మ‌యంలో అధికార పార్టీ లోపాల‌ను ఎండ‌గ‌ట్టాలి. దీనిలో ప్రజ‌ల‌ను త‌మ‌వైపు తిప్పుకొనేందుకు హామీలు అనేవి అత్యంత కీల‌కం. ఏ పార్టీ అయినా.. ఇదే వ్యూహంతో ముందుకు సాగుతుంది. పైగా ఇప్పుడు చంద్రబాబు అలాంటి ఎన్ని హామీలు ఇచ్చిన ప్రజల్లో నమ్మే పరిస్థితి లేదని అంటున్నారు. ఈ సమయంలో ఆ గ్యాప్ ని క్యాష్ చేసుకోవాల్సిన పవన్… తన లక్ష్యం జగన్ ని గద్దె దింపడమే అని చెబుతున్నారు.

దీంతో సంక్షేమం విషయంలో ఫుల్ మార్కులు సంపాదించుకున్న జగన్ ని అదే పనిగా దూషించడం, అగౌరవంగా ఏకవచనంతో సంబోధించడం, కారెక్కి కేకలు వేయడం వల్ల… జగన్ పై పవన్ పరోక్షంగా సానుభూతిని పెంచుతున్నరని అంటున్నారు పరిశీలకులు. పవన్ విమర్శలు ఎంత తీవ్రంగా ఉంటే జగన్ పై సింపతీ అంతలా పెరుగుతుందని చెబుతున్నారు. దీంతో పవన్ కల్యాణ్ కు ఆఫ్ ది రికార్డ్ థాంక్స్ చెబుతుందంట వైసీపీ కేడర్!