జనసేన ఎఫెక్ట్: వైసీపీ మునిసిపల్ టార్గెట్లు చాలా స్ట్రాంగ్‌గా!

పంచాయితీ ఎన్నికల్లో జనసేన ప్రభావం పెద్దగా లేదని రాజకీయ పార్టీలు, విశ్లేషకులతోపాటు తెలుగు మీడియా కూడా తేల్చేసిన వేళ, సోషల్ మీడియా జనసేన పార్టీకి బాగా ఉపయోగపడింది. ఏయే పంచాయితీల్లో జనసేన నెగ్గిందీ, ఆయా అభ్యర్థుల వివరాలతో.. సోషల్ మీడియా వెలికి తీసేసరికి, రాజకీయ పార్టలే కాదు, తెలుగు మీడియా కూడా ‘తప్పు’ సరిదిద్దుకోక తప్పలేదు. ఇదిలా వుంటే, ఈ తరహా ఎన్నికల్లో అధికార పార్టీకే ఎక్కువ సమస్యలుంటాయి. ఎందుకంటే, ఏకపక్షంగా జరగాల్సిన ఇలాంటి ఎన్నికల్లో విపక్షాలు ఏమాత్రం పోటీ ఇచ్చినా, అధికార పార్టీలో అంతర్గత సమస్యలు పెరిగిపోతాయి.

టీడీపీ మీద బుకాయించినంత తేలిగ్గా జనసేన విషయంలో బుకాయించడం వైసీపీకి సాధ్యపడటంలేదు. అందుకే, జనసేనను పూర్తిగా విస్మరించి.. బీజేపీ ప్లస్ అనే పేరుతో వైసీపీ అనుకూల మీడియా, జనసేన ఇమేజ్‌ని తగ్గించే ప్రయత్నం చేసి భంగపడింది. ఇక, జనసేన పార్టీకి 18 నుంచి 22 శాతం ఓట్లు పంచాయితీ ఎన్నికల్లో వచ్చాయని, వైసీపీ అనుకూల మీడియాకే చెందిన కొన్ని మీడియా సంస్థలు తేల్చడంతో, అధికార పార్టీలో గుబులు బయల్దేరింది. పంచాయితీ ఎన్నికలంటే రాజకీయ పార్టీల ప్రత్యక్ష ప్రమేయంతో జరగవు. కానీ, మునిసిపోల్స్ అలా కాదు. అందుకే, ఏ చిన్న తేడా కూడా రాకూడదంటూ పార్టీ ముఖ్య నేతలకు అధిష్టానం టార్గెట్లు పెట్టినట్లు తెలుస్తోంది.

మంత్రులు, ఇతర ముఖ్య నేతల్ని ఆయా మునిసిపోల్స్ పరిధిలో బాధ్యులుగా నియమించే ప్రక్రియ షురూ చేసింది వైసీపీ అధిష్టానం. నిజానికి, గత మార్చి నెలలోనే ఈ ఎన్నికలు జరగాల్సి వుండగా, కరోనా నేపథ్యంలో ప్రక్రియ కాస్త వాయిదా పడిందంతే. పంచాయితీ ఎన్నికల్లో అధికార పార్టీదే పైచేయి అయ్యింది.. కానీ, విపక్షాలు పోటీ ఇచ్చాయి. అందునా, జనసేన ఇచ్చిన పోటీ, అధికార పార్టీలో కొంత కంగారు పుట్టిస్తోంది.. గెలిచిన ఆనందం కూడా లేకుండా చేస్తోంది. ఆ ఆందోళనతోనే, మునిసిపోల్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి వైసీపీకి. జనసేన, మునిసిపోల్స్‌లో ఎంత ప్రభావం చూపుతుంది.? అన్న విషయాన్ని ఆలోచిస్తే, ఖచ్చితంగా పోటీ అయితే ఇవ్వొచ్చు.. కాలం కలిసొచ్చి.. జనసేనకి కొద్దో గొప్పో సీట్లు బాగానే కలిసొస్తే.. వైసీపీకి ఇకపై కష్ట కాలమే.