వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ… స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించడం రాజ్యాంగ విధి అంటున్న చంద్రబాబు… 2018లోనే గడువు ముగిసినా దమ్ము, ధైర్యంలేని చంద్రబాబు పారిపోయారని విమర్శించారు. చంద్రబాబు నాయుడికి నిజంగా సిగ్గు, మానం ఉంటే ఇలాంటి ప్రచారం చేయడని మండిపడ్డారు. ఎన్నికలకు వెళ్లే దమ్ము జగన్ కు లేదని చంద్రబాబు మాట్లాడితే చిన్నపిల్లలు కూడా నవ్వే పరిస్థితి వస్తుందని రోజా అన్నారు.
జగన్ దమ్మున్న వ్యక్తి అని, అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు, ఉద్యోగుల ప్రాణాల గురించి ఆలోచిస్తూ ఎన్నికలకు వెళ్లాలనుకోవడంలేదని స్పష్టం చేశారు. తామేమీ పూర్తిగా ఎన్నికలు రద్దు చేయాలని కోరడం లేదని రోజా స్పష్టం చేశారు. వ్యాక్సిన్ వచ్చిన తర్వాత ప్రజలు వ్యాధి నిరోధక శక్తి పొందితే అప్పుడు ఎన్నికలు జరిపితే బాగుంటుందని సీఎం జగన్ భావిస్తున్నారని, అందుకే పంచాయతీ ఎన్నికలు వాయిదా వేయాలని అంటున్నారని రోజా వివరించారు.
న్యాయస్థానం ఎన్నికలు జరపాలని తీర్పు ఇస్తే తాము శిరసావహిస్తామని రోజా స్పష్టం చేశారు. ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ తీరును ప్రజలు గమనిస్తున్నారని, నిమ్మగడ్డ లాగా అధికారపక్షంతో విభేదిస్తూ ఉద్దేశపూర్వకంగా ఇలా చేస్తున్న ఎస్ఈసీ మరొకరు ఉండరని విమర్శించారు. ఎన్నికలకు వైఎస్సార్‌సీపీ ఎప్పుడైనా సిద్ధమేనని.. తమ సంక్షేమ పథకాలే శ్రీరామ రక్ష అని తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న వాటికి కారకులెవరో ప్రజలకు తెలుసనీ , అలాంటి వాళ్లకి ప్రజలే బుడ్డి చెప్పాలని రోజా అన్నారు.