ఆనం రామనారాయణరెడ్డి.. సౌమ్యుడిగా పేరుంది. గతంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు.. అదీ ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో. రాజకీయంగా నిలకడ లేని వ్యక్తి అని ఆయన మీద ఇటీవలి కాలంలో ఓ బలమైన ముద్ర పడిపోయింది.
గతంలో టీడీపీలో చేరారు, ఆ తర్వాత వైసీపీలోకి దూకారు. ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేగా వున్నారు ఆనం రామనారాయణరెడ్డి. అయితే, ఆయనకు మంత్రి పదవి రావాల్సి వున్నా.. చివరి క్షణంలో ఆయన ఆ అవకాశాన్ని కోల్పోయారు. అది కూడా స్వయంకృతాపరాధమే.
తరచూ వైసీపీ మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటారాయన. నర్సాపురం ఎక్స్‌ప్రెస్ అని రఘురామకృష్ణరాజుని పిలిస్తే, నెల్లూరు ఎక్స్‌ప్రెస్.. అని ఆనం రామనారాయణరెడ్డిని అంటుంటారు. అంటే, వైసీపీలో నిరసన గళం వినిపించే నేతలన్నమాట.
‘నేను వైసీపీలో వున్నట్టా.? లేనట్టా.? వచ్చే ఎన్నికల్లో నాకు టిక్కెట్ వుంటుందా.? వుండదా.?’ అంటూ పార్టీకి సంబంధించిన ఓ వేదికపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఆనం రామనారాయణరెడ్డి. నిన్ననే, ‘జనంలోకి వెళ్ళలేని పరిస్థితి వుంది. రోడ్లు బాగు చేశామా.? అభివృద్ధి చేశామా.? ఏ మొహం పెట్టుకుని మళ్ళీ ఓట్లు అడుగుతాం.?’ అంటూ ఓ బహిరంగ సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు ఆనం.
ఆ వెంటనే, ఇదిగో ఇలా.. టిక్కెట్టు దొరుకుతుందా.? లేదా.? అంటూ కొత్త వివాదానికి తెరలేపారు. పక్కలో బల్లెంలా మారిన ఆనం రామనారాయణరెడ్డిని పార్టీ నుంచి బయటకు పంపకపోతే, తప్పుడు సంకేతాలు వెళతాయని వైసీపీ అదినేత వైఎస్ జగన్ ఎప్పుడు గుర్తిస్తారో ఏమో.! అయినా రఘురామకృష్ణరాజునే బయటకు పంపలేరు, ఆనంని బయటకు పంపగలరా.?