పరిటాల శ్రీరామ్ అలా బరిలో దిగితే…అక్కడ వైసీపీ గెలుపు ఖాయం

తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో కొన్ని కుటుంబాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాజకీయాల గురుంచి నలుసంత కూడా తెలియని వాళ్ళు టక్కున చెప్పే కొన్ని ఫ్యామిలీ పేర్లలో పరిటాల ఒకటి. పరిటాల రవి మరణాంతరం ఆయన భార్య సునీత రాజకీయాల్లోకి అడుగుపెట్టి టీడీపీ తరపున మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

అయితే పరిటాల రవి వారసుడిగా పరిటాల శ్రీరామ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నాడు. 2019 లో శ్రీరామ్ ఎన్నికల బరిలో దిగనున్నాడు అని టీడీపీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. పరిటాల శ్రీరామ్ కి యువతలో ఉన్న క్రేజ్ రీత్యా హిందూపూర్ నియోజకవర్గం నుండి ఎంపీగా పోటీ చేయించనుంది అధిష్టానం అని గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి.

అదే నిజమైతే హిందూపూర్ నుండి వైసీపీ గెలుపు ఖాయం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే అనంతపూర్ నుండి రెండు పార్లమెంటు సీట్లు ఉన్నాయి. ప్రస్తుతం అనంతపూర్ నియోజకవర్గం నుండి జేసీ దివాకర్ రెడ్డి, బీసీ(చేనేత) సామాజిక వర్గానికి చెందిన నిమ్మల క్రిష్టప్ప హిందూపూర్ నుండి ఎంపీలుగా ఉన్నారు. ఈసారి ఎలక్షన్స్ లో జేసీ దివాకర్ రెడ్డి కాకుండా ఆయన కుమారుడు పవన్ కుమార్ రెడ్డి ఎంపీ సీటుకే పోటీ చేస్తారని చెబుతున్నారు.

మరి ఈ నేపథ్యంలో బీసీ సామాజికవర్గానికి చెందిన నిమ్మల క్రిష్టప్పకి టికెట్ ఇవ్వకుండా పరిటాల శ్రీరామ్ కి టికెట్ ఇస్తే రెండు ఎంపి సీట్లు అగ్రకులాలకే కేటాయించారని బిసిల జిల్లాగా పేరున్న అనంతపూర్ బీసీలు ఆగ్రహిస్తారు. పైగా నిమ్మల క్రిష్టప్ప గతంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా (1994,1999) రెండుసార్లు (2009, 2014) ఎంపీగా నెగ్గి హిందూపూర్ పై మంచి పట్టు సాధించారు. ఆయనకి సౌమ్యుడిగా, వివాదరహితుడిగా పేరుంది. నియోజకవర్గంలోని ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది. మరి అటువంటి నిమ్మలను తీసేస్తే వ్యతిరేకత రాదా? అలాంటపుడు నిమ్మలను కాదని శ్రీరామ్ కి సై అంటే అది టీడీపీకి సాహసమే అవుతుంది.

మరోవైపు వైసిపి అధినేత జగన్ హిందూపూర్ ఎంపీ అభ్యర్థిగా బీసీ లేదా ముస్లిం సామజిక వర్గానికి చెందిన వారికే టికెట్ ఇవ్వాలి అనుకుంటున్నారు. నవీన్ నిశ్చల్, శంకర నారాయణ్, నదీమ్ అహ్మద్ ఈ ముగ్గురిలో ఒకరికి టికెట్ ఇవ్వాలి అనే ఆలోచనలో ఉన్నారట. దీనికి కారణం ఈ నియోజకవర్గంలో బిసి ఓటర్లు ఎక్కువగా ఉండటమే. తర్వాత మైనారిటీలు వస్తారు. అపుడు ఈ వర్గాల ఓటర్లు వైసీపీ వైపే మొగ్గు చూపే అవకాశం ఉంటుంది.

వైసీపీకి మరొక ప్లస్ పాయింట్ ఏంటంటే పరిటాల శ్రీరామ్ కి నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలతో సఖ్యత లేదు అనేది టీడీపీ వర్గాల నుండే వినిపించే టాక్. టిడిపిలో ఉన్నవాళ్లంతా పరిటాల కుటుంబ సానుభూతిపరులు అనుకోవడానికి వీల్లేదు. వారిలో కొందరు వ్యతిరేకులు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలోశ్రీరామ్ ని హిందూపూర్ ఎంపిగా పోటీలో నిలబెడితే పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు కూడా శ్రీరామ్ కి పొగపెట్టే అవకాశం మెండుగా ఉంది.

ఈ రెండు కారణాల వలన శ్రీరామ్ ని నిలబెడితే టీడీపీ ఓడిపోవడం ఖాయం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అదే గనుక జరిగితే మా గెలుపు ఖాయమని హిందూపూర్ వైసిపి వర్గాలు అపుడే సంబరంగా చర్చించుకుంటున్నాయి. ఇటు తెలుగు తమ్ముళ్లే కాదు వైసీపీ నేతలు కూడా పరిటాల శ్రీరామ్ ఎన్నికల్లో నిలబడాలి అనుకుంటున్నది దీని కోసమే. వైసీపీ అధినేత జగన్ కూడా బీసీ లేదా మైనారిటీలకే టికెట్ కేటాయించాలి అనుకుంటున్నారు కాబట్టి హిందూపూర్ లో వైసీపీ ఈజీగా గెలుస్తుంది అని సంతోషపడుతున్నారు వైసీపీ శ్రేణులు.