గుండెపోటుతో మరణించాడని అనుకున్న వైఎస్ వివేకానందరెడ్డి ఘటన సంచలనంగా మారే సూచనలు కనబడుతున్నాయి. ఉదయం గుండెపోటుతో వివేకా మరణించాడనే అందరూ అనుకున్నారు. అయితే పిఏ కృష్ణారెడ్డి ఫిర్యాదుతో ఇపుడు మృతిపై అనేక అనుమానాలు మొదలయ్యాయి. దానికితోడు వైసిపి కీలక నేత విజయసాయిరెడ్డి, మాజీ ఎంపి అవినాష్ రెడ్డి కూడా వేవికా మృతిపై లోతుగా విచారణ జరపాలని డిమాండ్ చేయటంతో సర్వత్రా ఆసక్తి పెరిగిపోతోంది.
పులివెందుల పోలీసు స్టేషన్లో పిఏ ఇచ్చిన ఫిర్యాదు ప్రకారమైతే వివేకా బాత్ రూమ్ లో రక్తపుమడుగులో పడున్నారు. ప్రతీరోజు తాను నిద్రలేపితేనే వివేకా లేచేవారని అంటున్నారు. అలాంటిది తాను వివేకా ఇంటికి వచ్చి బెడ్ రూమ్ లోకి వెళ్ళేటప్పటికే ఆయన లేరట. తర్వాత బాత్ రూమ్ లో పడిఉన్నారని గుర్తించారు. దాంతో గుండెపోటుతో మరణించారని మొదట అనుకున్నారట.
అయితే, వివేకా మృతదేహాన్ని చూసినపుడు రక్తపుమడుగులో పడివుండటం, తల, చేతులు, వేళ్ళపై బలమైన గాయాలు అయినట్లు గుర్తించారు. వెంటనే కుటుంబసభ్యులకు సమాచారం అందించి పోలీసు స్టేషన్లో కూడా పిఏ ఫిర్యాదు చేయటంతో వివేకా మృతి సంచలనంగా మారింది. ఇదే విషయాలను విజయసాయి, అవినాష్ కూడా ప్రస్తావిస్తూ ప్రభుత్వం వెంటనే విచారణ మొదలుపెట్టాలని డిమాండ్ చేశారు.
ఇక్కడే అనేక అనుమానాలు వస్తున్నాయి. అవినాష్ చెప్పిన ప్రకారం రాత్రి 11 గంటల వరకూ నేతలతో మాట్లాడిన వివేకా ఇంటికెళ్ళి పడుకున్నారట. మరి రాత్రి తర్వాత ఇంట్లోకి ఎవరైనా వెళ్ళారా ? అన్నది తేలాలి. వివేకా ఇంటికి ఎవరూ కాపలా లేరా ? అన్న అనుమానాలు మొదలయ్యాయి. ఇంట్లోకి వెళ్ళి గాయపరిచి హత్య చేసేంత శతృవులు వివేకాకు ఎవరూ లేరనే అంటున్నారు. మరి ఎవరో గాయపరచకపోతే తల, మొహం, చేతులు, వేళ్ళపై గాయాలు ఎలా అయ్యాయన్నది అందరినీ వేధిస్తున్న ప్రశ్నలు. పోస్టు మార్టమ్ జరిగి పోలీసులు విచారణ జరిపితే కానీ వాస్తవాలు బయటకు వచ్చే అవకాశాలు లేవు.