YS Sharmila: రాజారెడ్డిని చూసి వైసీపీకి భయం పట్టుకుందా..? షర్మిల అతిగా ఊహించుకుంటున్నారా..?

YS Sharmila

ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. వైఎస్ ఫ్యామిలీ నుంచి మరో వారసుడు రాజకీయాల్లోకి రాబోతున్నారు. ఏపీ కాంగ్రెస్ అధినేత్రి షర్మిల కుమారుడు రాజారెడ్డి రాజకీయాల్లోకి రానున్నారు. అవసరమైనప్పుడు తన కుమారుడు రాజకీయాల్లోకి తప్పకుండా వస్తారని షర్మిల స్పష్టం చేశారు. వైఎస్సార్ వారసుడు తన తనయుడు రాజారెడ్డి అని ఆమె ప్రకటించారు. దీంతో మరోసారి వైఎస్సార్ రాజకీయ వారసత్వంపై జోరుగా చర్చ మొదలైంది. సాధారణంగా తండ్రి మరణించిన వెంటనే రాజకీయ వారసత్వం కోసం కుమారులు పోటీపడతారు. కుమార్తెలు పోటీపడినా కానీ వారు ప్రజల ఆదరణ పొందడంలో విఫలమవుతున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజలు కుమార్తెలను వారసులుగా గుర్తించరనే విషయం పలుమార్లు తేటతెల్లమైంది.

వైఎస్ వారసుడిగా జగన్‌కు విశేష ప్రజాదరణ..

వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసుడిగా జగన్ మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు. 2009లో కాంగ్రెస్ పార్టీ తరపున కడప ఎంపీగా పోటీచేసి గెలుపొందారు. అయితే వైఎస్ అకాల మరణం తర్వాత జగన్ కొంత గడ్డుపరిస్థితులు ఎదుర్కొన్నారు. ఆయన చేపట్టిన ఓదార్పుయాత్రకు కాంగ్రెస్ అధిష్టానం అడ్డు చెప్పడంతో ఆ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం 2011లో సొంతంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్నారు. అప్పటి నుంచి వారసుడిగా వైఎస్సార్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తానంటూ ప్రజల్లో పోరాటం చేశారు. ఆయనను జనం విపరీతంగా ఆదరించారు. 2019లో భారీ మెజార్టీతో వైఎస్ వారసుడిగా అందలం ఎక్కించారు.

భర్త ఇంటి పేరు పెట్టుకోకుండా..

అయితే ఇప్పుడు వైఎస్ వారసుడిగా తన తనయుడు రాజారెడ్డిని షర్మిల రంగంలోకి దించారు. దీంతో రాజారెడ్డి ఇంటి పేరు వైఎస్ కాదంటూ సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. వాస్తవంగా భర్త ఇంటి పేరు కుమారుడికి వస్తుంది. ఈ విషయాన్ని షర్మిల అంగీకరించలేకపోతున్నారు. వైఎస్ బ్రాండ్ వదలడానికి ఆమె ఇష్టపడటం లేదు. దీనినే వైసీసీ కార్యకర్తలు అడుగుతున్నారు. ఇందుకు కౌంటర్‌గా షర్మిల చేసిన వ్యాఖ్యలపై చర్చ జరుగుతోంది. నాకొడుకు రాజకీయాల్లోకి రాకముందే వైసీపీకి భయం పట్టుకుందా అని ప్రశ్నించారు. తన కుమారుడికి రాజారెడ్డి అని స్వయంగా వైఎస్సార్ నామకరణం చేశారని చెబుతున్నారు.

వైఎస్ ట్యాగ్‌తో నాయకులు అయిపోరు..

షర్మిల వ్యాఖ్యలను రాజకీయ విశ్లేషకులు తప్పుపడుతున్నారు. పేరుకు ముందుకు వైఎస్ ట్యాగ్‌లైన్ తగిలించుకున్న మాత్రాన నాయకులు అయిపోరని సూచిస్తున్నారు. ఎవరైనా సరే నాయకుడిగా ఎదగాలంటే ప్రజాదరణ ఉండాలని గుర్తుచేస్తున్నారు. ప్రజలు ఆదరిస్తే వారసత్వం ఉన్నా లేకపోయినా నాయకులుగా రాణిస్తారని చెబుతున్నారు. అసలే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంకు లేదని.. అలాంటి పార్టీ ద్వారా రాజారెడ్డి రాజకీయాల్లోకి అరంగేట్రం చేస్తే ప్రయోజనం ఉండదంటున్నారు. అయినా రాజారెడ్డికి ప్రజల్లో లభించే ఆదరణ బట్టి అతడి భవిష్యత్ ఆధారపడుతుందని పేర్కొంటున్నారు. అంతేకాని ఇంకా రాజకీయాల్లోకి రాకముందే అతడిని చూసి బలమైన క్యాడర్ ఉన్న వైసీపీ ఎందుకు భయపడుతుందని ప్రశ్నిస్తున్నారు.

వారసత్వం గురించి మాట్లాడటం హాస్యాస్పదం..

జగన్‌కు కుమారులు లేకపోయినా ఆయనకు ప్రస్తుతం 52 ఏళ్లు మాత్రమే. ఇంకా రెండు దశాబ్దాల పాటు ఆయన రాజకీయాల్లో కీలకంగా ఉంటారు. అందులోనూ జగన్‌కు ప్రజల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. 2024 ఎన్నికల్లో ఓడిపోయినా వైసీపీకి 40శాతం ఓటు బ్యాంకు ఉంది. బలమైన క్యాడర్, ఓటు బ్యాంకు ఉన్న వైసీపీ రాజకీయాల్లోకే అడుగుపెట్టని రాజారెడ్డిని చూసి భయపడుతుందని షర్మిల చెప్పడం హాస్యాస్పదంగా ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆలు లేదు సూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లు.. తన కుమారుడు రాజకీయాల్లోకి రాకుండానే వారసత్వం గురించి మాట్లాడటం అనవసరమని వాదిస్తున్నారు. ముందు షర్మిల ప్రజాదరణ పొంది ఎన్నికల్లో గెలిచి చూపించాలని సవాల్ విసురుతున్నారు. ఆ తర్వాత కుమారుడు వారసత్వం గురించి మాట్లాడాలని సోషల్ మీడియాలో వైసీపీ అభిమానులు కౌంటర్ ఎటాక్ చేస్తున్నారు.