ఎన్డీయేతోనే వున్నాం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుకాయింపు.!

‘ఎన్డీయే నుంచి బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీకి మద్దతిచ్చానంటే..’ అని నిన్ననే చెప్పుకున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పెడన నియోజకవర్గంలో నిర్వహించిన వారాహి విజయ యాత్ర సందర్భంగా.

నియోజకవర్గం కైకలూరుకి మారేసరికి.. విషయంలో తేడా వచ్చేసింది. ‘మేం ఎన్డీయే నుంచి బయటకు రాలేదు. అలా బయటకు వచ్చామని మీరెలా చెబుతారు.? మీకేంటి సంబంధం.?’ అంటూ వైసీపీ మీద విరుచుకుపడిపోయారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.

ఎక్కడో ఏదో తేడా కొడుతోంది. బీజేపీ అంటే కొంత భయంతోనే వ్యవహరిస్తున్నారు జనసేన అధినేత. లేకపోతే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీకి ఒక్క శాతం కూడా ఓటు బ్యాంకు లేదాయె. పోనీ, కేంద్రంలో బీజేపీ అధికారంలో వుంది గనుక, జనసేనకు బీజేపీ నుంచి వేరే రకంగా ఏమన్నా ఉపయోగం జరిగిందా.? జరుగుతుందా.? అంటే అదీ లేదు.

బీజేపీ కోణంలో చూస్తే, జనసేన – బీజేపీ మాత్రమే కలిసి, 2024 ఎన్నికల్ని ఫేస్ చేస్తాయి. టీడీపీ కోణంలో చూస్తే, టీడీపీ – జనసేన మాత్రమే ఎన్నికల్లో పోటీ చేస్తాయి. జనసేన కోణంలో చూస్తే మాత్రం టీడీపీ – జనసేన – బీజేపీ కలిసి పోటీ చేస్తాయి.

ఎలా చూసినా, పవన్ కళ్యాణ్ మధ్యవర్తిత్వంతో టీడీపీ – బీజేపీ మధ్య బంధం బలపడుతుందని మనం అనుకోవాలన్నమాట. అలాగని పవన్ కళ్యాణ్ నానా రకాలుగా కష్టపడుతున్నారు. ముఖ్యమంత్రి పదవి మీద మోజు లేదంటారు, ఆ పదవి వస్తే స్వీకరిస్తానని చెబుతారు.

పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు టీడీపీకి అర్థమవుతున్నాయి. బీజేపీకీ అర్థమవుతున్నాయి. జనసేన శ్రేణులకే అర్థం కావడంలేదు. ఇంతకీ, జనసైనికులు బీజేపీ జెండా పట్టుకోవాలా.? వద్దా.? ప్చ్, ఆ విషయమై జనసైనికులకు అస్సలు క్లారిటీ దొరకడంలేదు. నిన్నేమో బీజేపీ జెండా కింద పడేశారు. ఇప్పుడు దాన్ని మళ్ళీ పట్టుకోవాలన్నమాట.