జనసేనని 20 నియోజకవర్గాల్లో వైసీపీ గెలిపిస్తుందా.?

జనసేన పార్టీని ‘ప్యాకేజీ పార్టీ’గా అభివర్ణించేందుకు నిన్న మొన్నటిదాకా వైసీపీ ప్రయత్నిస్తే, ఇప్పుడు టీడీపీ కూడా అదే పనిలో బిజీగా వుంది.! టీడీపీ అను‘కుల’ మీడియా, జనసేన పార్టీకి వెయ్యి కోట్ల ప్యాకేజీ.. అంటూ ఈ మధ్యనే ఓ ప్రచారం తెరపైకి తెచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా, అదే టీడీపీ అను‘కుల’ మీడియాకి చెందిన ఇంకో ఛానల్, జనసేన పార్టీని 20 స్థానాల్లో గెలిపించే బాధ్యతను వైసీపీ తీసుకుందంటూ కథనాలు షురూ చేసింది. ఇటీవల ఢిల్లీకి వెళ్ళి ప్రధాని సహా పలువురు కేంద్ర ప్రభుత్వ పెద్దల్ని కలిసిన వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్  రెడ్డి, ఈ మేరకు ప్రతిపాదనల్ని ఢిల్లీ బీజేపీ పెద్దల ముందుంచారట.

వైఎస్ జగన్ తమ ముందుంచిన ప్రతిపాదనల్ని, ఇటీవల పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన సందర్భంగా ఢిల్లీ బీజేపీ పెద్దలు వివరించారట. జనసేన పార్టీ 20 నియోజకవర్గాల్లో పోటీ చేస్తే, అన్ని నియోజకవర్గాల్లోనూ ఆ పార్టీని గెలిపించేందుకోసం అవసరమైన ఆర్థిక వనరుల్ని సమకూర్చుతామని వైఎస్ జగన్ హామీ ఇచ్చి వచ్చారట.

కామెడీ కాకపోతే, ఆ ఆలోచన వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వుంటే, నేరుగా పవన్ కళ్యాణ్‌తోనే ఆ దిశగా చర్చలు జరుపుతారు కదా.? అయినా, ఆ అవసరం వైసీపీకి ఏముంది.? ఎక్కడ టీడీపీకి జనసేన దూరమవుతుందోనన్న భయం టీడీపీ అనుకూల మీడియాలో బయల్దేరింది. నిజానికి, ఈ భయం చంద్రబాబు వెన్నులో ప్రకంపనలు సృష్టిస్తున్న దరిమిలా, ఆయనే తన అనుకూల మీడియా ద్వారా ఈ దుష్ప్రచారానికి తెరలేపినట్లుగా కనిపిస్తోంది.