టీడీపీ నాయకులే “అనంత‌పురం” కార్పొరేష‌న్ ను వైసీపీకి కట్టబెట్టేలా ఉన్నారు !

Will TDP take over Anantapur Corporation?

ఆంధ్ర ప్రదేశ్: గత మూడు దశాబ్దాల నుండి రాష్ట్రంలో అనంత‌పురం జిల్లా రాజకీయం పరంగా టీడీపీకి కంచుకోటగా నిలబడింది‌. కొన్ని ద‌శాబ్దాలుగా పార్టీని న‌డిపిస్తున్న సీనియర్ నాయ‌కులు ఇక్క‌డ ఉన్నారు. పార్టీ త‌ర‌ఫున ఎవ‌రు బ‌రిలో నిలిచినా.. తిరుగులేద‌నే భావన పార్టీ అధిష్టానంలోనూ…ప్రజల్లోనూ ఉంది. ఇది వాస్త‌వ‌మే. అయితే… తాజాగా వైసీపీ పార్టీ దూకుడుతో ఇప్పుడు ఆ ప‌రిస్థితి లేకుండా పోయింది. 2019 ఎన్నిక‌ల్లో టీడీపీ ఇక్క‌డ కేవ‌లం రెండు ఎమ్మెల్యే స్థానాల‌కే పరిమితమైంది. లోక్ సభ నియోజకవర్గంస‌హా మిగిలిన అన్ని నియోజ‌క‌వ‌ర్గాలలోనూ వైసీపీ పాగా వేసింది. అన్నింటినీ గంపగుత్తుగా ఎగ‌రేసుకుపోయింది.

Will TDP take over Anantapur Corporation?
Will TDP take over Anantapur Corporation?

జ‌గ‌న్ పాద‌యాత్ర‌ల ప్ర‌భావంతో వీచిన వైసీపీ గాలి కారణంగా ప్ర‌జ‌ల నాడి మారిందని పార్టీలో విశ్లేష‌ణ‌లు వ‌చ్చాయి. నిజమేనని అంద‌రూ స‌రిపెట్టుకున్నారు. కానీ, తాజాగా జ‌రిగిన మూడు ద‌శ‌ల పంచాయ‌తీ ఎన్నిక‌లలోని చాలా స్థానాలను వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. టీడీపీ నాయ‌కులు చెప్పుకోవ‌డానికి కూడా మిగ‌ల‌కుండా..మెజారిటీ పంచాయ‌తీల‌ను కైవ‌సం చేసుకుంది. మ‌రి దీనిని ఎలా చూడాలి. 2019 ఎన్నిక‌ల‌ పూర్తయినప్పటి నుంచి పంచాయతీ ఎన్నికలు జరిగేనాటికి 20 నెల‌ల స‌మ‌యం పట్టింది. మ‌రి ఈ 20 నెలల కాలంలో జ‌గ‌న్ స‌ర్కారుపై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త ప్ర‌బ‌లింద‌ని టీడీపీనే చెబుతున్నా.. ఆ త‌ర‌హా ప్ర‌భావం ఇక్క‌డ క‌నిపించ‌లేదు. మరి వారు చెప్తున్నట్లు టీడీపీ నేత‌లు పుంజుకున్నారా ? అంటే.. అది కూడా క‌నిపించ‌డం లేదు.

తెదేపా నేత‌లు ఎవ‌రికి వారే యమునా తీరే అన్నరీతిలో వ్యవహరిస్తుండడంతో పార్టీపై ప్ర‌జ‌ల‌కున్న అభిప్రాయాలు మారిపోతున్నాయి. మ‌రికొద్ది వారాల‌లోనే కార్పొరేష‌న్ ఎన్నిక‌లు వ‌స్తున్నాయి. 2013 ఎన్నిక‌ల్లో అనంతపురం కార్పొరేష‌న్‌ను టీడీపీ కైవ‌సం చేసుకుంది. అయితే.. ఇప్పుడు కూడా ఆ స్థానాన్ని టీడీపీ ద‌క్కించుకుంటుందా? లేదా అన్నది ప్రశ్నార్థకం. టీడీపీ నేతలంతా ఒక్కతాటిపైకి వచ్చి మనస్పర్థలు వీడి కలిసికట్టుగా ముందుకు సాగితేనే వైసీపీని ఎదుర్కోగలరన్న భావన కేడర్ లో వ్యక్తమవుతోంది. అలా కాకుండా ఎవ‌రికి వారుగా గ్రూపు రాజ‌కీయాలు చేసుకుంటూ వర్గపోరు పోతే వైసీపీ నే ఇక్క‌డ పాగా వేయ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. అనంతపురం కార్పొరేష‌న్‌ టీడీపీ ద‌క్కించుకుంటుందా? వైసీపీకి కట్టబెడతారా? చూద్దాం.