ఇతర పార్టీలతో జనసేనకు పొత్తు లేనట్టేనా.. పవన్ ఈ విషయాన్ని చెప్పగలరా?

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడ మాట్లాడినా వైసీపీని 2024లో అధికారంలోకి రానివ్వనని చెబుతారు. ప్రస్తుతం జనసేనకు బీజేపీతో పొత్తు ఉంది. రాబోయే రోజుల్లో బీజేపీ జనసేన మధ్య పొత్తులు ఉండకపోవచ్చని ప్రచారం జరుగుతోంది. బీజేపీ పవన్ కళ్యాణ్ కు ఆశించిన స్థాయిలో ప్రాధాన్యత ఇవ్వకపోవడం, పవన్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించకపోవడం విషయంలో జనసేన అభిమానుల్లో ఒకింత అసంతృప్తి ఉంది.

అదే సమయంలో బీజేపీతో పొత్తు కంటే టీడీపీతో పొత్తు వల్లే జనసేనకు ఎక్కువగా లాభం ఉంటుందని చెప్పవచ్చు. ఈ కారణం వల్లే జనసేన సైతం టీడీపీకి ప్రాధాన్యత ఇస్తోంది. టీడీపీ జనసేన కలిస్తే ఏపీలో కచ్చితంగా టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంది. జగన్ సర్కార్ సంక్షేమ పథకాలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా అమలు చేస్తున్నా ఇతర విషయాలకు సంబంధించి ప్రజల్లో ఊహించని స్థాయిలో అసంతృప్తి ఉంది.

అయితే జనసేన నేతలు మాత్రం ఇతర పార్టీలతో జనసేనకు పొత్తు లేదని సీఎం అభ్యర్థిగా తానే ఉంటానని పవన్ చెప్పారని వెల్లడిస్తున్నారు. జనసేన కీలక నేతలలో ఒకరైన బొలిశెట్టి సత్యనారాయణ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకుంటే పవన్ కళ్యాణ్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించే అవకాశం అయితే దాదాపుగా ఉండదని చెప్పవచ్చు.

అయితే పవన్ కళ్యాణ్ మనసులో ఏముందో స్పష్టత రావాలంటే మాత్రం మరి కొంతకాలం ఆగాల్సిందేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు చంద్రబాబును నమ్మలేమని ఆయన మాటలతో నమ్మించి మోసం చేస్తారని మరి కొందరు చెబుతున్నారు. కాపుల ఓట్ల కోసమే జనసేన పవన్ ను వాడుకుంటుందని కూడా కామెంట్లు జోరుగా ప్రచారంలోకి వస్తుండటం గమనార్హం. ఈ కామెంట్ల గురించి పవన్ కళ్యాణ్ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. మరోవైపు ఇతర పార్టీలతో పొత్తు లేదని తానే సీఎం అభ్యర్థినని పవన్ చెప్పగలరా అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.