పోలవరం ప్రాజెక్టుకి మోడీ సర్కారు బ్రేకులేస్తుందా.?

Polavaram

పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్స్ వ్యవహారానికి సంబంధించి, తెలంగాణ రాష్ట్రం కేంద్రానికి ఫిర్యాదు చేసిన విషయం విదితమే. ఇటీవల గోదావరి నదికి వచ్చిన వరద నేపథ్యంలో, బ్యాక్ వాటర్ విషయమై పునఃపరిశీలన చేయాలంటూ కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది.

ఉమ్మడి తెలుగు రాష్ట్రం విభజన సమయంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం నిమిత్తమే ముంపు మండలాల్ని, తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం బదలాయించింది. అందులోంచి ఐదు గ్రామాల్ని తమకు ఇచ్చేయాలని తెలంగాణ డిమాండ్ చేస్తోందిప్పుడు. ఇన్నేళ్ళ తర్వాత ఈ వాదనను తెలంగాణ ప్రభుత్వం ఎందుకు తెరపైకి తెస్తోంది.? అన్న ప్రశ్నకు ‘రాజకీయమే’ కారణమని నిస్సందేహంగా సమాధానం చెప్పొచ్చు.

అయితే, పోలవరం అనేది జాతీయ ప్రాజెక్టు. పెద్దయెత్తున నిధులు ఈ ప్రాజెక్టు కోసం అటు కేంద్రం, ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖర్చు చేయడం జరిగింది. అయితే, ఏళ్ళ తరబడి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం సాగుతూనే వుంది. ఈ క్రమంలో తెలంగాణ అభ్యంతరాల్ని పరిగణనలోకి తీసుకుని కేంద్రం, పోలవరం ప్రాజెక్టు పనులకు బ్రేక్ వేసే అవకాశం లేదు. అలాగని, పనులు వేగంగా ముందుకు సాగే అవకాశమూ కనిపించడంలేదు.

కేంద్రం, ఈ ప్రాజెక్టు మీద ఇంకా 20 వేల కోట్లకు పైనే ఖర్చు చేయాల్సి వస్తుంది. అదే అసలు సమస్య. ఆ సొమ్ములు ఇవ్వకుండా కేంద్రం, ఈ ప్రాజెక్టుని నాన్చుతూనే వుంది. రాష్ట్రమెలాగూ అంత ఖర్చుని ఈ ప్రాజెక్టు మీద తనంతట తానుగా వెచ్చించే అవకాశమే లేదు.

సో, తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి రాయడం వల్ల అదనపు ప్రయోజనమేదీ తెలంగాణకు జరిగే అవకాశం కూడా లేదన్నమాట.