Chandrababu : ఉమ్మడి తెలుగు రాష్ట్రం విభజనతో ఆంధ్రప్రదేశ్‌కి అన్యాయం జరిగిందని ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంటు సాక్షిగా ప్రకటించిన దరిమిలా, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఇప్పుడెలా స్పందిస్తారు.? మాజీ మిత్రపక్షం బీజేపీ ఎందుకు ప్రత్యేక హోదా రాష్ట్రానికి ఇవ్వలేకపోయిందో చంద్రబాబు సమాధానం చెప్పగలుగుతారా.? లేదా.?
గతం గతః ఇప్పుడైనా చంద్రబాబు, కేంద్రంలోని మోడీ సర్కారుని ప్రత్యేక హోదా విషయమై గట్టిగా నిలదీస్తే, రాష్ట్రానికి కాస్తో కూస్తో మేలు జరిగే అవకాశం వుంది. బీజేపీతో కలిసి వున్నన్నాళ్ళూ ప్రత్యేక హోదాకి పాతరేసి, బీజేపీతో విడిపోయాక ప్రత్యేక హోదాపై నినదించిన చంద్రబాబు, ఆ తర్వాత ఆ విషయాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారు.
ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని ప్రశ్నించాల్సింది పోయి, రాష్ట్రంలోని అధికార పార్టీపై దుమ్మెత్తిపోయడంతోనే సరిపెట్టారు చంద్రబాబు ఇప్పటిదాకా. సుదీర్ఘ రాజకీయ అనుభవం వున్న చంద్రబాబు, ప్రత్యేక హోదా విషయంలో వైసీపీకి మద్దతుగా వుంటామని ప్రకటించాల్సిన సందర్భమిది. అయితే, చంద్రబాబు నుంచి అలాంటి రాజకీయాన్ని ఆశించలేం.
మరోపక్క, వైసీపీ కూడా ప్రత్యేక హోదా విషయమై కేంద్రాన్ని నిలదీయడానికి ఇంతకంటే మంచి అవకాశం ఇంకోటి దొరక్కపోవచ్చు. గతంలో తమ ఎంపీలతో రాజీనామా చేయించి, కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నించిన వైసీపీ అధినేత, ఇప్పుడు అలాంటి పని చేయించగలరా.? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న.
ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ ఈ విషయంలో లీడ్ తీసుకుంటే, అధికార వైసీపీ కూడా అదే బాటలో పయనించే అవకాశాల్లేకపోలేదు.