ఆంధ్రప్రదేశ్‌లో ‘బీఆర్ఎస్’ పోటీ చేయబోతోందా.?

ఆంధ్రోళ్ళ బిర్యానీ పేడలా వుంటుంది.. అన్నది చాలా చాలా చిన్నమాట. ఉద్యమ కాలంలో ఆంధ్రా పేరు ప్రస్తావనకు వస్తేనే చిర్రెత్తుకొచ్చేసేది తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నేతలకీ, కార్యకర్తలకీ. కానీ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత అలాంటి పంచాయితీలేం లేవు.

ఇప్పుడు ఆ తెలంగాణ రాష్ట్ర సమితి కూడా లేదు. అదిప్పుడు భారత్ రాష్ట్ర సమితిగా మారింది. బీఆర్ఎస్ జెండాని కేసీయార్ ఈ రోజు ఆవిష్కరించగా, నిన్ననే సమైక్య నినాదం వినిపించింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఇది ఒకింత వ్యూహాత్మకమేనన్నది నిర్వివాదాంశం.

ఇంతకీ, ఏపీలో బీఆర్ఎస్ పోటీ చేస్తుందా.? లేదా.? పోటీ చేయడానికి అవకాశాలైతే మెండుగానే వున్నాయి. ఏపీలోని కొన్ని నియోజకవర్గాల్లో తమకు సానుకూల పరిస్థితులున్నాయని గతంలోనే తెలంగాణ రాష్ట్ర సమితి చెప్పింది. అందులో కొంత నిజం లేకపోలేదు కూడా.

మైనార్టీ ఓటు బ్యాంకు.. అందునా, మజ్లిస్ ప్రభావం వున్న ప్రాంతాల్లో టీఆర్ఎస్‌కి అడ్వాంటేజ్ వుంటుంది. దానికి తోడు, కొన్ని సామాజిక వర్గాలకు చెందిన ఓటర్లు, తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన కొందరు నాయకుల పట్ల సానుకూలతతో వున్నారు.

ఈ ప్రత్యేక ఓటు బ్యాంకు 2019 ఎన్నికల్లో వైసీపీకి కలిసొచ్చింది. అప్పట్లో వైసీపీకి టీఆర్ఎస్ తెరవెనుకాల మద్దతిచ్చింది. ఈసారి అలా కాదు.. తామే బరిలోకి దిగుతామని కొందరు టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. అందుకేనేమో, వైసీపీ ‘సమైక్య నినాదం’ షురూ చేసింది. దాంతో టీఆర్ఎస్ పూర్తిగా లాక్ అయిపోయింది.