‘వారాహి’ యాత్రపై వైసీపీ ఎందుకు ఉలిక్కిపడాలి.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ‘వారాహి’ యాత్రకు ముహూర్తం ఖరారయ్యిందన్న ప్రకటన జనసేన నేత నాదెండ్ల మనోహర్ నుంచి రాగానే, వైసీపీ నేతలు ఒకరొకరుగా మీడియా ముందుకొచ్చేశారు.

వైసీపీలో కొందరు నేతలు మీడియా ముందుకు రావాలంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి.. లేదా, ‘వారాహి’ గురించిన వార్త ఏదో ఒకటి వచ్చి తీరాలన్నట్లు తయారైంది పరిస్థితి.

జనసేనకు కౌంటర్ ఇచ్చేందుకు మాత్రమే వైసీపీలో కొందరున్నట్లున్నారు. ఆయా నేతలు, ఇతర విషయాలపై మీడియా ముందుకు అస్సలు రారు. ఆ లిస్టులో మొదటి పేరు మాజీ మంత్రి పేర్ని నానిదే. ఆయన ఇటీవల రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించేశారు.. అదీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో.

అయితే, రిటైర్మెంట్ అనేది 2024 ఎన్నికల తర్వాత వర్తిస్తుందట. ఏమో, అప్పటికి పరిస్థితులు ఎలా మారతాయో. తూర్పుగోదావరి జిల్లా నుంచి వారాహి యాత్ర ప్రారంభమవుతుందని నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. అంతే, అది వారాహి చంద్రవరం యాత్ర.. అంటూ పేర్ని నాని సెటైర్ వేసేశారు. జనసేన శ్రేణులు ఊరుకుంటాయా.? వైఎస్సార్ చంద్రబాబు పార్టీ.. అంటూ వైసీపీ మీద కౌంటర్ ఎటాక్ ప్రారంభించారు.

వారాహి అనేది ఓ ప్రచార వాహనం. దానికి జనసేన కంటే వైసీపీనే ఎక్కువ ఎలివేషన్లు ఇస్తోంది. పవన్ కళ్యాణ్‌నీ, వారాహిని లైట్ తీసుకోవడమే వైసీపీకి ఉత్తమం.! వైసీపీ నినాదం వైనాట్ 175. జనసేన మాత్రం, పదో పాతికో సీట్లు టీడీపీ నుంచి పొందాలని చూస్తోంది. అలాంటి జనసేనకు ఎందుకు అంత హైప్ వైసీపీ ఇస్తున్నట్టు.?