కాంగ్రెస్ హంగామా.! వైఎస్ షర్మిల మౌనం.! దేనికి సంకేతం.?

కాంగ్రెస్ పార్టీ నానా హంగామా చేస్తోంది.. వైఎస్ షర్మిల తమ పార్టీలో చేరబోతున్నారని చెబుతూ. అయితే, ఈ విషయమై వైఎస్ షర్మిల మాత్రం మౌనం దాల్చారు. అసలేం జరుగుతోంది.? తెరవెనుక అన్న వైఎస్ జగన్‌తో బేరసారాలు సాగుతున్నాయా.? బోల్డన్ని గుసగుసలు.. కుప్పలు తెప్పలుగా విశ్లేషణలు.!

తెలంగాణలో వైఎస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించిన వైఎస్ షర్మిల, దాదాపుగా ఆ దుకాణం మూసేశారు. ప్రస్తుతం కొత్త కుంపటిని ఆంధ్రప్రదేశ్‌లో తెరిచేంత రిస్క్ ఆమె చెయ్యలేరు. రాజకీయాలు అంత సులువు కాదన్న విషయం ఆమెకు గతంలోనే
అర్థం అయి వుండాలి.

నిజానికి, తెలంగాణలో చాలా ధైర్యంగానే ఆమె పార్టీని స్థాపించి, సుదీర్ఘ పాదయాత్ర కూడా చేసేశారు. నానా రకాల విమర్శలూ ఎదుర్కొన్నారు. ‘ఆడపిల్ల అంటే, ఆడ పిల్ల..’ అంటూ ఏవేవో వ్యాఖ్యలు చేశారు. ‘పాదయాత్ర అంటే, పాదాల మీద నడిచే యాత్ర..’ అని చెప్పి నవ్వులపాలయ్యారు కూడా.

ఆంధ్రప్రదేశ్‌లో అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఎదిరించి రాజకీయం చేయడం చిన్న విషయం కాదు. కాంగ్రెస్ పార్టీ నుంచి అండదండలు వున్నా, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోవడం వైఎస్ షర్మిలకు సాధ్యమయ్యే విషయం కాదు.

మరి, షర్మిల ఏం చేయబోతున్నారు.? 2024 ఎన్నికల్లో ‘వై నాట్ 175’ అనే ఆలోచనతో వున్న వైసీపీ, షర్మిల తలనొప్పిని తప్పించుకునేందుకు బేరసారాలు షురూ చేయడంలో వింతేమీ లేదు. ఆ బేరసారాలకు షర్మిల కాంప్రమైజ్ అయిపోతే, ఆమెకే మంచిది. ఏ రాజ్యసభ సీటుతోనే ఆమె వైసీపీలోనే సరిపెట్టుకోవడం ఉత్తమం.

ఇంతకీ, షర్మిల మనసులో ఏముంది.? జరుగుతున్న ప్రచారాల్ని ఆమె ఎందుకు ఖండించలేకపోతున్నారు.? సమర్థించలేకపోతున్నారు.? ఏమో, ఆమెకే తెలియాలి.