రాజకీయాల్లో విమర్శలు తేలిక.! ఆచరణ చాలా చాలా కస్టం.! వ్యవస్థల్ని మేనేజ్ చేయడంలో చంద్రబాబు దిట్ట.. అనే మాట తరచూ వింటాం. ఎంత దిట్ట.? ప్రధాని కంటే ఘనుడా.? ముఖ్యమంత్రి కంటే బలవంతుడా.? అధికారం కోల్పోయినా, చేతిలో 20 మంది ఎమ్మెల్యేలు కూడా లేకపోయినా, చంద్రబాబు వ్యవస్థల్ని మేనేజ్ చేయగలడని ఎవరన్నా అంటే ఎలా నమ్మేది.?
పదే పదే ఒకటే మాట.! పాడిందే పాటరా పాచి పళ్ళ డాష్ డాష్.. అన్న చందాన తయారైంది పరిస్థితి. అమరావతి భూ కుంభకోణమన్నారు.. ఇంకేవేవో కుంభకోణాలని అంటూనే వున్నారు. తాజాగా, అదే అమరావతి వ్యవహారానికి సంబంధించి, దాదాపు 100 కోట్ల పైన ముడుపులు చంద్రబాబుకి అందాయన్నది ఓ ఆరోపణ.
ఐటీ శాఖ ఈ మేరకు చంద్రబాబుకి నోటీసులు జారీ చేసిందట. ‘మీరు నోటీసులు జారీ చేస్తే, నేనెందుకు సమాధానం చెప్పాలి.?’ అని చంద్రబాబు ప్రశ్నించేస్తున్నారు. దొంగలు పడ్డ ఆర్నెళ్ళకు.. అన్న చందాన, ఎప్పుడో నోటీసులు వస్తే, ఇప్పుడు వైసీపీ యాగీ షురూ అయ్యింది.
దీనర్థమేంటి.? వైసీపీ చేతిలో అధికారం వుంది. పైగా, బీజేపీతో వైసీపీ సన్నిహితంగా మెలుగుతోంది. ఇంకెందుకు ఆలస్యం, అరెస్టు చేసేసి.. లోపలేసెయ్యొచ్చు కదా.? కానీ, వచ్చింది నోటీసులు మాత్రమే. చంద్రబాబు, వాటికి వివరణ ఇస్తారా.? ఇవ్వరా.? అన్నది ముందు ముందు తేలుతుంది.
నిజానికి, విషయం చిన్నది కాదు.! కానీ, దీని చుట్టూ అనవసరమైన అల్లరి చేయడం ద్వారా వైసీపీ, సమస్య తాలూకు గాఢతను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నట్లే కనిపిస్తోంది.