జనసేన పార్టీలో పృధ్వీరాజ్ ఎందుకు ఇంకా చేరడంలేదు.?

జనసేన పార్టీ తరఫున సినీ నటుడు పృధ్వీరాజ్ వకాల్తా పుచ్చుకుంటున్నాడు. న్యూస్ ఛానళ్ళలో జనసేన పార్టీ నేతగానే చెలామణీ అవుతున్నాడాయన. అయితే, ఇంతవరకు జనసేనలో పృధ్వీరాజ్ చేరలేదు. కారణమేంటి.? 2019 ఎన్నికలకు ముందు పృధ్వీరాజ్ వైసీపీలో వున్నారు. అప్పట్లో వైఎస్ జగన్ తరఫున వకాల్తా పుచ్చుకుని వైసీపీ ప్రత్యర్థుల్ని నానా రకాలుగా తిట్టాడు. పవన్ కళ్యాణ్ మీద కూడా నానా రకాల విమర్శలూ చేశాడు పృధ్వీరాజ్. అలా వైసీపీలో అగ్రెసివ్‌గా వుండడం ద్వారా మీడియా దృష్టిని ఆకర్షించిన పృధ్వీరాజ్, వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎస్వీబీసీ ఛానల్ ఛైర్మన్‌గా పదవి దక్కించుకున్న సంగతి తెలిసిందే.

కానీ, ఆ ఛానల్‌లో పనిచేసే ఓ ఉద్యోగిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడనే ఆరోపణల నేపథ్యంలో పదవి నుంచి తీసివేయబడ్డాడు. ఆ తర్వాత వైసీపీకి ఆయన రాజీనామా చేశాడు. అప్పటినుంచే వైసీపీ మీద విమర్శలు చేయడం మొదలు పెట్టాడు పృధ్వీరాజ్. అంతేనా, వైసీపీ అంటే టెర్రరిస్టుల్ని తయారు చేసే ఫ్యాక్టరీ లాంటిదేనంటూ వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశాడాయన.

ఏ పార్టీలో వుంటే, ఆ పార్టీ తరఫున వకాల్తా పుచ్చుకుని, ఇతర పార్టీలను తూలనాడటం రాజకీయాల్లో కొత్తేమీ కాదు. వైసీపీ ఎమ్మెల్యే, మంత్రి రోజా గతంలో చేసిందీ, ఇప్పుడు చేస్తున్నదీ అదే. కొడాలి నాని అయినా, ఇంకొకరైనా.. ఎవరూ ఇందుకు అతీతులు కారు. కాగా, జనసేనలో చేరేందుకు ముహూర్తం కోసం ఎదురుచూస్తున్నాడట పృధ్వీరాజ్. త్వరలో జనసేనాని బస్సు యాత్ర చేపట్టనున్న దరిమిలా, ఆ యాత్ర సమయంలోనే జనసేనలో పృధ్వీరాజ్ చేరాలనుకుంటున్నాడట.