సజ్జల రామకృష్ణారెడ్డిని జనసేనాని పవన్ కళ్యాణ్ ఎందుకు టార్గెట్ చేసినట్లు.?

ఈ మధ్య తరచూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నోట ‘డిఫాక్టో ముఖ్యమంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి..’ అనే మాట వస్తోంది. గతంలో అయితే, ‘సజ్జల రామకృష్ణారెడ్డిగారూ..’ అని సంబోదించేవారు జనసేన అధినేత. అంతే కాదు, ‘పెద్దలు సజ్జల రామకృష్ణారెడ్డిగారు.. మీరంటే నాకు గౌరవం..’ అని చెబుతుండేవారు. ఎందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వరం మారింది సజ్జల రామకృష్ణారెడ్డి విషయంలో.? తాజాగా మంగళగిరి పార్టీ కార్యాలయంలో తూర్పు కాపు సామాజిక వర్గ ప్రతినిథులతో భేటీ అయిన పవన్ కళ్యాణ్, ‘డిఫాక్టో ముఖ్యమంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి’ అని ప్రస్తావించడం అందర్నీ ఆశ్చర్యపరిచింది.

‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అజ్ఞానంలో వుంటారు.. డిఫాక్టో ముఖ్యమంత్రి సజ్జల రామకృష్ణారెడ్డిగారూ.. మీరే స్క్రిప్టులు పంపిస్తుంటారు నన్ను మీ పార్టీ నేతలతో తిట్టించేందుకోసం. కొంచెం ప్రజా సమస్యల పట్ల కూడా బాధ్యతగా స్పందించండి..’ అంటూ సజ్జలపై సెటైర్లు వేశారు జనసేనాని. నిజానికి, అప్రస్తుతం ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి ప్రస్తావన. సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వ సలహాదారు. వైసీపీ కీలక నేత. వైసీపీలో నెంబర్ టూ పొజిషన్ ముమ్మాటికీ సజ్జల రామకృష్ణారెడ్డిదే. ఈ నేపథ్యంలోనే సజ్జలను టార్గెట్ చేస్తే, వైసీపీలో ప్రకంపనలు వస్తాయని బహుశా జనసేనాని భావిస్తున్నట్టున్నారు.

అయితే, పవన్ కళ్యాణ్ ఎన్ని గిమ్మిక్కులు చేసినా సజ్జల రామకృష్ణారెడ్డి, తమ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ధిక్కరించే పరిస్థితి వుండదు. అదే సమయంలో సజ్జల రామకృష్ణారెడ్డిని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనుమానించే పరిస్థితీ వుండదు.