వై నాట్ 175: వైఎస్ జగన్ వర్సెస్ చంద్రబాబు, పవన్ కళ్యాణ్.!

ఇదో చిత్రమైన ఈక్వేషన్.! ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. అన్ని నియోజకవర్గాల్లోనూ వైసీపీ పోటీ చేయనుంది. ఏమో, కాంగ్రెస్ పార్టీ కూడా అన్ని సీట్లలోనూ పోటీచేస్తుందేమో. టీడీపీ సంగతేంటి.? జనసేన పార్టీ పరిస్థితేంటి.? ఇదే ఇప్పుడు ఉత్కంఠ రేపుతున్న అంశం.

ఎన్ని సీట్లలో పోటీ చేయాలి.? అన్నదానిపై ఆయా రాజకీయ పార్టీలకు ఓ ఆలోచన వుంటుంది. ప్రధాన రాజకీయ పార్టీలు అన్ని చోట్లా పోటీ చేయాలనుకోవడం సహజమే. పొత్తుల వ్యవహారం నడిస్తే, లెక్కలు వేరేలా వుంటాయ్.! ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా వున్నప్పుడూ అప్పటి కాంగ్రెస్ పార్టీ పొత్తులు పెట్టుకుంది. కొన్ని స్థానాల్ని మిత్రపక్షాలకు కేటాయించింది. సో, పొత్తులనేవి నేరం కాదు. నైతికత, అనైతికత.. వంటి వాటి గురించి రాజకీయాల్లో మాట్లాడకూడదు. మాట్లాడితే, అదో బూతు అవుతుంది.

ఇక, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పదే పదే, ‘ధైర్యముంటే 175 సీట్లలో పోటీ చేయండి..’ అంటూ సవాల్ విసురుతున్నారు టీడీపీ, జనసేన పార్టీలకి. నిజానికి, అది వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అనవసరం. మొత్తంగా 175 సీట్లూ వైసీపీనే గెలుస్తుందని వైఎస్ జగన్ చెబుతున్నారాయె. అలాంటప్పుడు, మిగతా పార్టీలు ఎన్ని సీట్లలో పోటీ చేస్తే ఆయనకేంటి.?

అంటే, ఎక్కడో తేడా కొడుతోందన్నమాట. గెలుపు విషయమై వైఎస్ జగన్ కొంత అసహనంతో వున్నారన్నమాట. ఇదీ టీడీపీ, జనసేన విశ్లేషణ. అంతే తప్ప, మేం 175 సీట్లలో పోటీ చేస్తాం.. అని టీడీపీ, జనసేన చెప్పలేకపోతున్నాయి.