చంద్రబాబునాయుడు హఠాత్తుగా ఢిల్లీకి వెళ్ళారు. రోజువారీ షెడ్యూల్ మొత్తాన్ని రద్దు చేసుకుని మరీ ఢిల్లీకి వెళ్ళటంతో అనేక అనుమానాలు మొదలయ్యాయి. చివరి దశ పోలింగ్ దగ్గర పడటంతో పాటు ఢిల్లీ రాజకీయం కూడా వేడెక్కటంతో చంద్రబాబు ఉన్నపాటున ఢిల్లీకి వెళ్ళిపోయారు.
చంద్రగిరి నియోజకవర్గంలోని ఐదు పోలింగ్ కేంద్రాల్లో రీ పోలింగ్ కు ఆదేశించటంతో ఎన్నికల కమీషన్ పై చంద్రబాబు అండ్ కో మండిపోతున్నారు. ఆ విషయంగా నిరసన తెలపటానికే చంద్రబాబు ఢిల్లీ వెళ్ళినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే అందులో పూర్తి నిజం లేదన్నదే వాస్తవం. ఎందుకంటే రీ పోలింగ్ కు ఆదేశాలిచ్చేసిన తర్వాత చంద్రబాబు ఎంత నిరసన తెలిపినా ఉపయోగం లేదని అందరికీ తెలిసిందే.
ఎలక్షన్ కమీషన్ ను కలిసే ముసుగులోనే చంద్రబాబు జాతీయ నేతలను కలవనున్నట్లు సమాచారం. ఇప్పటి వరకూ జరిగిన ఎన్నికల సరళిని గమనిస్తే ఎన్డీఏ, యూపిఏలో దేనికీ అధికారంలోకి వచ్చేంత పూర్తి మెజారిటీ రాదని తెలిసిపోతోంది. దాంతో తటస్తంగా ఉండే నవీన్ పట్నాయక్, కెసియార్, అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డే కీలకమవుతారు. అలాగే మమతా బెనర్జీ, మాయావతి, అఖిలేష్ యాదవ్ లాంటి వాళ్ళు ఎలాగు ఉండనే ఉన్నారు.
ఇలా అందరితోను మాట్లాడి మారుతున్న రాజకీయాల్లో తన భవిష్యత్తుకు భరోసా కల్పించుకునేందుకే చంద్రబాబు హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరినట్లు సమాచారం. మొన్ననే కెసియార్, స్టాలిన్ భేటీ జరిగింది. అంటే రేపో మాపో జగన్ తో కూడా కాంగ్రెస్ తరపున ఎవరైనా భేటీ జరిగే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. ఆ బాధ్యతను కాంగ్రెస్ అధిష్టానం మధ్యప్రదేశ్ సిఎం కమలనాధ్ కు అప్పగించిందట. ఇటువంటి పరిణామాలను తెలుసుకున్న తర్వాతే చంద్రబాబు ఢిల్లీకి వెళ్ళారని సమాచారం.
