కమ్యూనిస్టులను కెలుకుతున్న కేశినేని

కమ్యూనిస్టు పార్టీలను టిడిపి ఎంపి కేశినేని నాని బాగా కెలికేస్తున్నారు. మరి ఆయన చేస్తున్న పని పార్టీకి, ఆయనక మంచిది కాదా అన్నది పక్కన పెడితే అసలు వాళ్ళను కెలకాల్సిన అవసరం ఎంపికి ఏమొచ్చిందన్నదే ఇక్కడ ప్రశ్న.

కేశినేని ట్రావెల్స్ పేరుతో ఎంపికి పెద్ద రవాణా వ్యవస్ధే ఉండేది. అయితే 2014లో ఎంపిగా గెలిచిన తర్వాత కొంతకాలానికి హటాత్తుగా ట్రావెల్స్ సంస్ధను మూసేశారు. అప్పట్లో కేశినేని ట్రావెల్స్ మూసివేత పెద్ద సంచలనమైంది. అంతకుముందే ట్రాన్స్ పోర్టు కమీషనర్ బాలసుబ్రమణ్యంతో గొడవవ్వటం, బస్సులను రవాణా శాఖ అధికారులు ఎక్కడికక్కడ సీజ్  చేయటం కూడా జరిగింది.

తనమీద తమ ప్రభుత్వమే కక్షగట్టిందన్న కారణంతో ట్రావెల్స్ మూసేసినట్లు ఒక ప్రచారం జరిగింది. అదేం కాదని ట్రావెల్స్ సంస్ధ బాగా నష్టాల్లో ఉండటంతో తట్టుకోలేక మూసేశారనే మరో ప్రచారం కూడా వినిపించింది. మొత్తానికి కారణం ఏదైనా ట్రావెల్స్ ను అయితే ఎంపి మూసేశారు.

అయితే మామూలుగా ఎవరైనా చేసేదేమిటంటే తమ సంస్ధను మూసేటపుడు ఉద్యోగులను పిలిపించి ఓ సమావేశం ఏర్పాటు చేస్తారు. సంస్ధను మూసేస్తున్నట్లు ప్రకటిస్తారు. అప్పటి వరకూ పనిచేసిన ఉద్యోగులకు చెల్లించాల్సిన జీతబత్యాలను సెటిల్ చేసేస్తారు. లేదా పలానా తేదీలోగా  సెటిల్ చేస్తామంటూ భరోసా ఇస్తారు. కానీ ఎంపి మాత్రం అదేమీ చేయకుండానే ఒక్కసారిగా మూసేశారు. దాంతో ఉద్యోగులంతా రోడ్డున పడ్డారు. అప్పటి నుండి వాళ్ళకు ఎంపి ఏమీ సెటిల్ చేయలేదని సమాచారం.

అప్పట్లో ప్రభుత్వం కూడా వాళ్ళదే కాబట్టి ఏదోలా నెట్టుకొచ్చేశారు. కానీ ఇపుడు మళ్ళీ గొడవలు మొదలయ్యాయి. వాళ్ళకు కమ్యూనిస్టు పార్టీలు నాయకత్వం వహిస్తున్నాయి. దాంతో ఎంపికి ఒళ్ళు మండి నోటికొచ్చినట్లు ట్విట్టర్లో వ్యాఖ్యలు చేస్తున్నారు.  మరి ఎంపి కెలుకుతున్న కొత్త సమస్య ఏ పరిణామాలకు దారితీస్తుందో చూడాల్సిందే ?