‘ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటే ఉరేసుకుంటా ’….సీనియర్ మంత్రి కెఇ కృష్ణమూర్తి…..
‘కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటే జనాలు బట్టలూడదీసి తంతారు’ …చింతకాయల అయ్యన్నపాత్రుడు…….
ఇవి కాంగ్రెస్ పార్టీతో పొత్తుకు ముందు సీనియర్ మంత్రులిద్దరూ మీడియాతో మాట్లాడిన మాటలు.
‘ బిజెపి అనుసరిస్తున్న నిరంకుశ వైఖరికి నిరసనగా, దేశాన్ని రక్షించుకునేందుకే కాంగ్రెస్ తో చంద్రబాబునాయుడు పొత్తు పెట్టుకున్నారు’……పొత్తు తర్వాత మంత్రుల యూ టర్న్ మాటలివి.
పొత్తు తర్వాత మంత్రులు చెబుతున్న మాటలు. పొత్తులకు ముందు అంత గట్టిగా మాట్లాడిన మంత్రులు పొత్తుల తర్వాత ఒక్కసారిగా ప్లేటు ఎందుకు ఫిరాయించారు ? ఎందుకంటే, చంద్రబాబు తోక కట్ చేసేస్తారన్న భయం. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు ఇవ్వకపోతే తెలుగుదేశంపార్టీలో వాళ్ళిద్దరి కథ కంచికి చేరుతుంది. టిక్కెట్టు రాకపోతే వాళ్ళని మళ్ళీ దేకేవారు కూడా ఉండరని వాళ్ళకు బాగా తెలుసు. తెలుగుదేశంపార్టీ అధికారంలోకి వచ్చినా ప్రతిపక్షంలో కూర్చున్నా అంతా చంద్రబాబు వల్లే. మిగిలిన వాళ్ళంతా నిమ్మితమాత్రులే. ఆ విషయం మరచిపోయే కొందరు అప్పుడప్పుడు తమిష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటారు.
పొత్తులపై మంత్రులు కెఇ అయినా చింతకాయలైన అలా మాట్లాడిన వాళ్ళే. అందుకే వాళ్ళిద్దరితో విడివిడిగా మాట్లాడిన చంద్రబాబు ఫుల్లుగా క్లాస్ పీకారని సమాచారం. ఆ తర్వాతే మళ్ళీ మంత్రులు నోరిప్పలేదు. చివరకు పొత్తులు అధికారమైన తర్వాత మంత్రులు యు టర్న్ తీసుకుని చంద్రబాబు నిర్ణయానికి మద్దతుగా మాట్లాడారంటే క్లాసు ఫలితమనే అనుకోవాలి. మొత్తానికి చంద్రబాబు నిర్ణయాలతో విభేదించే దమ్మున్న నేతలు తెలుగుదేశంపార్టీలో ఎవరూ లేరన్న విషయం మాత్రం అర్ధమైపోయింది.