ఇంతకీ, ఎందుకు ఆంధ్రాకి జగనే కావాలి.?

ఎందుకు ఆంధ్రాకి జగనే కావాలి.? అనే కోణంలో వైసీపీ, రాష్ట్ర ప్రజల ముందుకు వెళ్ళబోతోందిట.! గడప గడపకీ మన ప్రభుత్వం.. మ నమ్మకం నువ్వే జగన్.. ఇలా పలు పేర్లతో, జనం వద్దకు వైసీపీ నేతలు, అందునా ప్రజా ప్రతినిథులు వెళ్ళడం చూశాం. ఇంటింటికీ స్టిక్కర్లు కూడా అంటించారు.. వాటిని ఎప్పుడో జనం పీకేశారు కూడా.!

వైనాట్ 175 అనే వ్యూహంతో 2024 ఎన్నికలకు వెళ్ళాలని వైసీపీ భావిస్తోంది. ఏ రాజకీయ పార్టీకి అయినా, ఇలాంటి లక్ష్యాలు వుండడంలో తప్పు లేదు. 2019 ఎన్నికల్లో ఓ అనూహ్యమైన వేవ్, వైసీపీకి 151 అసెంబ్లీ సీట్లను కట్టబెట్టింది. 22 ఎంపీ సీట్లను వైసీపీ ఆ ఎన్నికల్లో గెలుచుకుంది.

కానీ, అప్పటికీ.. ఇప్పటికీ చాలా తేడా వుంది. జనసేన – టీడీపీ ఒక్కటయ్యాయి. జనసేనతో బీజేపీ కలిసే వుంది. జనసేన – టీడీపీ – బీజేపీ కలుస్తాయన్న ప్రచారం వుంది. ఒకవేళ బీజేపీ కలవకపోయినా జనసేన – టీడీపీకి అయితే వచ్చే ఎన్నికల్లో అడ్వాంటేజ్ వుండబోతోందన్నది బహిరంగ రహస్యం.

నో డౌట్, సంక్షేమ పథకాల విషయంలో లబ్దిదారులు, వైసీపీ సర్కారుపై కాస్తంత పాజిటివిటీతోనే వున్నారు. కానీ, రోడ్లు సహా రాష్ట్ర అభివృద్ధి విషయంలో వైసీపీకి ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వుంది.

ఎన్నికలకు ఆర్నెళ్ళు మాత్రమే సమయం వుంది. ప్రత్యేక హోదా రాలేదు.. పోలవరం ప్రాజెక్టూ పూర్తి కాలేదు. మద్య నిషేధమూ జరగలేదు. రాజధాని అమరావతి ఒక్క అడుగు కూడా ముందుకు కదల్లేదు. పోనీ, మూడు రాజధానుల వ్యవహారమైనా ముందుకు కదిలిందా.? అంటే, అదీ లేదాయె.

కొందరు ప్రజా ప్రతినిథులకు సీట్లు ఇవ్వలేకపోతున్నట్లు వైసీపీ అధినేత ప్రకటించేశారు. ఇంకొందరేమో, వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా వుంటామని అధినేతకే తెగేసి చెప్పేస్తున్నారు. కింది స్థాయిలో వైసీపీ ప్రజా ప్రతినిథుల పట్ల ప్రజల్లో వున్న వ్యతిరేకత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అర్థం కావడంలేదా.? అన్న డౌట్, వైసీపీ శ్రేణులకే వస్తోంది.