జనసేనాని పవన్ కళ్యాణ్‌కి ఆ ‘అవకాశం’ వుందిగానీ.!

ఏమో, కాలం కలిసొస్తే 2024 ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి విజయం దక్కొచ్చు.. ఆయన అసెంబ్లీకి వెళ్ళొచ్చు.. అదృష్టం వరిస్తే, ఆయన ముఖ్యమంత్రి అయ్యేందుకూ అవకాశం లేకపోలేదు. నిజానికి, 2019 ఎన్నికల్లోనే పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచి వుండాలి. ఆ మాటకొస్తే, జనసేన పార్టీని స్థాపించి, 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీలకు మద్దతిచ్చి ఊరుకున్నారుగానీ.. ఆ ఎన్నికల్లో జనసేన కూడా పోటీ చేసి వుంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ జనసేన అధినేత అసెంబ్లీకి అప్పట్లోనే వెళ్ళి వుండేవారు. అవకాశాల్ని ఎవరు చేజార్చుకుంటున్నారు.? అని జనసేన అధినేత గురించి ఆలోచిస్తే.. ఆయనకి వేరే శతృవులు అక్కర్లేదు. ఆయనకి ఆయనే శతృవు.. ఆయన ఎదుగుదలకు ఆయనే ప్రతిబంధకంగా మారుతుంటారనే విషయం అర్థమవుతుంది.

పాతికేళ్ళ ప్రస్తానం.. అంతటి సుదీర్ఘమైన ఆలోచన.. అని జనసేన అధినేత చెప్పడం తప్పు కాదు. కానీ, ఇప్పుడేం చేస్తున్నామన్నదీ ముఖ్యమే. 2019 ఎన్నికల్లో టీడీపీ – జనసేన మధ్య పొత్తు లేదు. కానీ, టీడీపీ, ఓ వైపు జనసేనను తిడుతూనే, ఆ జనసేన తమకు మిత్రపక్షం లాంటిదేనని ప్రచారం చేసింది. అలా జనసేనకు దారుణమైన దెబ్బ తగిలింది. ఇప్పటికీ జనసేనాని, టీడీపీ అధినేత చంద్రబాబు కబందహస్తాల నుంచి బయటకు రాలేకపోతున్నారు. టీడీపీతోనూ, వైసీపీతోనూ సమదూరం గనుక జనసేనాని పాటించగలిగితే.. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో జనసేనానికి ‘అవకాశం’ వుంటుంది. అది ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వెళ్ళడమా.? ముఖ్యమంత్రి పదవా.? అన్నది వేరే చర్చ.