పవన్ కు ఏమయ్యింది ?

పాపం జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఏమో అయ్యింది. ఏమో అయ్యిందని అందరికీ అర్ధమవుతోంది కానీ ఏమైందో మాత్రం స్పష్టంగా ఎవరికీ తెలియటం లేదు. లేకపోతే మొన్న తన సన్నిహితుడు ఆలీని తిట్టారు. తాజాగా కాకినాడ టిడిపి అభ్యర్ధి చెలమలశెట్టి సునీల్ పై మండిపడ్డారు. ఇంతకీ వారిపై పవన్ కు ఎందుకంత కడపు మంట ?

ఎందుకంటే, వారిద్దరూ జనేసేనలో చేరలేదట. ఆలీ యేమో వైసిపిలో చేరితే, సునీలేమో తెలుగుదేశంపార్టీ తరపున పోటీ చేస్తున్నారు. పవన్ , ఆలీ బాగా సన్నిహితులన్న విషయం అందరికీ తెలిసిందే. వారిద్దరిదీ సినిమా స్నేహం. ఆలీ వైసిపిలో చేరటాన్ని తట్టుకోలేకపోయిన పవన్ బహిరంగంగానే దూషించారు. ఆలీ తనకు నమ్మక ద్రోహం చేశారంటూ మండిపడ్డారు. సరే అందుకు ఆలీ కూడా అదే స్ధాయిలో రిటార్ట్ ఇచ్చారనుకోండి అది వేరే సంగతి.

తాజాగా చెలమలశెట్టి సునీల్ పై పవన్ మండిపడ్డారు. సునీల్ జనసేనలో చేరుతానని చెప్పి తన సమయాన్నంతా వృధా చేశారట. పవన్ మాటలు విన్నవారికి చాలా విచిత్రంగా అనిపిస్తోంది.  పార్టీల్లో  చేరటమన్నది ఎవరిష్టం వారిది. ఆప్షన్లుప్పుడు ఎవరైనా ఏ పార్టీలో చేరితే తమకు బాగుంటుందో అనేక రకాలుగా బేరీజు వేసుకునే చేరుతారు. వైసిపి, టిడిపిల్లో చేరితే తమకు ఉపయోగమనుకుని వారిద్దరు చేరుంటారు.

జనసేనలో చేరినందువల్ల ఏమాత్రం ఉపయోగం లేదని అంచనాకు వచ్చిన తర్వాతే వారు పై పార్టీల్లో చేరుంటారు. అంతమాత్రానా వారిద్దరిపై బహిరంగసభల్లో పవన్ మండిపడటం విచిత్రంగా ఉంది. అసలు వారిద్దరి గురించి పవన్ మాట్లాడటమంటేనే తన స్ధాయిని తాను తగ్గించేసుకున్నట్లు. వాళ్ళిద్దరూ జనసేనలో చేరకపోతే పార్టీని మూసేసుకుంటారా పవన్ ? అంటే రేపటి ఎన్నికల్లో జరిగేదదే అనే ప్రచారం కూడా జరుగుతోంది లేండి అది వేరే సంగతి.  అయినా చంద్రబాబునాయుడు అడుగుజాడల్లో నడుస్తున్న పవన్ కు ఇంతకన్నా మంచి ఆలోచనలు ఎలా వస్తాయి లేండి ?