ఇప్పటికైతే బీజేపీతో కలిసున్నాం: పొత్తులపై జనసేనాని.!

‘మేం పొత్తులో లేమని ఎవరు చెప్పారు.? బీజేపీతోనే పొత్తులో వున్నాం. బీజేపీతోనే కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తాం. ఒకవేళ కొత్త పొత్తులు కుదిరితే ఆలోచిస్తాం. ఒంటరిగా అయినా కలిసి వెళతాం అవసరమైతే..’ అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేశారు.

2024 ఎన్నికలకు సంబంధించి ఏపీలో బీజేపీతో కలిసి జనసేన ముందుకు వెళుతుందని ఇరు పార్టీలూ చెబుతున్నాయి. కానీ, టీడీపీకి జనసేన అమ్ముడుపోయిందని వైసీపీ ఆరోపిస్తోంది. అధికార వైసీపీ చేసే రాజకీయ విమర్శలకు గతంలోనే జనసేనాని ‘చెప్పు’తో సమాధానం చెప్పారనుకోండి.. అది వేరే సంగతి.

తెలంగాణలో అయితే బీజేపీ – జనసేన మధ్య పొత్తు లేదు. రెండు పార్టీలకూ మధ్య గ్యాప్ కనిపిస్తోంది. మరోపక్క, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్ నేతృత్వంలోని భారత్ రాష్ట్ర సమితిని స్వాగతిస్తున్నట్లు చెప్పారు పవన్ కళ్యాణ్.

కొండగట్టులో ఆంజనేయస్వామి సన్నిధిలో తన ఎన్నికల ప్రచార వాహనం ‘వారాహి’కి ప్రత్యేక పూజలు నిర్వహించారు పవన్ కళ్యాణ్. ‘కొండగట్టు ఆంజనేయస్వామి వల్లనే నాకు పునర్జన్మ లభించిందని భావిస్తాను. అందుకే వారాహిని ఇక్కడి నుంచే ప్రారంభిస్తున్నా..’ అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.

కాగా, ‘బీజేపీతో వెళతాం.. కుదిరితే కొత్త పొత్తులు.. ఏదీ కుదరకపోతే ఒంటరిగానే..’ అంటూ జనసేనాని చేసిన వ్యాఖ్యల్లో మళ్ళీ స్పష్టత కొరవడింది. అంటే, ప్రస్తుతానికి జనసేన అన్ని ఆప్షన్స్‌నీ ఓపెన్‌గానే వుంచిందన్నమాట.. టీడీపీతో పొత్తు సహా.!