విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వివాదం రోజురోజుకూ రాజుకుంటోంది. అఖిల పక్షం, కార్మిక సంఘాలు కలిసికట్టుగా ఉద్యమాన్ని ఉధృతం చేసే పనుల్లో ఉన్నాయి. దీంతో ఆధికార పక్షం వైసీపీకి తలనొప్పి మొదలైంది. ఈ ఉద్యమం గనుక బలపడి తీవ్ర రూపం దాల్చితే దానికి నాయకత్వం వహిస్తున్న వారే ప్రజల్లో మైలేజీ పొందగలరు. కాబట్టి తొందరపడితే ఉదయం ఫలితాన్ని అందుకోగలమని జగన్ భావించినట్టున్నారు. అందుకే ఉత్తరాంధ్ర కీ లీడర్ విజయసాయిరెడ్డిని రంగంలోకి దింపారు. వెళ్లి ఉక్కు ఉద్యమం మొత్తాన్ని మనవైపుకు తిప్పండని సెలవొచ్చారో ఏమో కానీ విజయసాయి ఉద్యమంలోకి దూకేశారు.
ఎప్పటిలాగే కేంద్రం మెడలు వంచేసి ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకుంటామని సెలవిచ్చారు. గత రెండేళ్లుగా హోదా, పోలవరం నిధులు, రైల్వే జోన్, కడప స్టీల్ ప్లాంట్ ఇలా విభజన హామీల్లో ఉన్న ప్రధాన అంశం దేన్నీ సాధించలేకపోయిన వైసీపీ ఇప్పుడు ప్రైవేటీకరణను అడ్డుకుంటాం అంటే నమ్మడం ఎలాగని అంటున్నారు జనం. పెద్దల సభలోనే ఉక్కు ప్రైవేటీకరణను సవాల్ చేశామని చెప్పుకుంటున్న విజయసాయిరెడ్డి ఆల్ పార్టీ మీటింగ్లో కూడ అదే కాన్ఫిడెన్స్ కనబరచాలని అనుకున్నారు. కానీ కేంద్రం ముందు చెప్పినట్టు తాటాకు చప్పుళ్ల మాటలు ఆల్ పార్టీ మీటింగ్లో ఉద్యమకారుల ముందు చెప్పేసరికి పసిగట్టేసినట్టున్నారు వాళ్ళు.
అందుకే విజయసాయిరెడ్డిని మాట మాటకు నిలదీశారు. విజయసాయి ఉక్కుశాఖ మంత్రితో ఆల్ పార్టీ సభ్యులకు మీటింగ్ పెట్టిస్తానని, తానే నాయకత్వం వహిస్తానని అన్నారు. అయితే సభ్యులు మాత్రం తమకు ఉక్కు మంత్రితో సమావేశం ఎందుకని అన్నారు. వాళ్ళకీ తెలుసు ప్రధాన మంత్రి కనుసన్నల్లోనే అన్ని శాఖలు నడుస్తాయని. కాబట్టి నొక్కేదేదో ప్రధాన దగ్గరే నొక్కితే జాప్యం లేకుండా ప్రైవేటీకరణను ఆపేది లేనిది తేలిపోతుందని అప్పుడు తదుపరి కార్యాచరణను నిర్ణయించుకోవచ్చని వాళ్ళ అభిప్రాయం కాబోలు. దాంతో ఉక్కు శాఖ మంత్రి దగ్గరకు కాదు ప్రధాని వద్దకు తీసుకెళ్లండి అంటూ డిమాండ్ చేశారు. దాంతో విజయసాయి ఖంగుతిన్నారు. ప్రధాని వద్దకు అంటే తన వల్ల కాదని, ఉక్కు మంత్రి దగ్గరకు వెళదాం.. వస్తే రండని అన్నారు. దీంతో ఆల్ పార్టీ సభ్యులు ఆయన్ను నిలదీశారు. కాన్వాయిని అడ్డుకున్నారు. వైసీపీ అనుకూల మీడియాలో ఉక్కు ఉద్యమం వైసీపీ చేతిలో ఉన్నట్టే కలరింగ్ కొడుతున్నారు కానీ వాస్తవ పరిస్థితులు అలా లేవని అంటున్నారు.