వైసీపీ తీర్థం పుచ్చుకున్న టీడీపీ ఎమ్మెల్యేలు అందరూ చేసిన పని చంద్రబాబు నాయుడును తిట్టి పోయడం. అయితే విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ మాత్రం అంతకు మించి చేశారు. అదే జగన్ మీద పొగడ్తలు కురిపించడం. జగన్ గొప్పగా పాలిస్తున్నారని, బాబు ఒత్తిడి తట్టుకోలేక ఆయన్ను ఇన్నాళ్లు మనసు చంపుకుని విశాఖ వీధుల్లో విమర్శిస్తూ వచ్చానని, ఇక వల్ల కాక టీడీపీని వీడి వైసీపీలో చేరుతున్నానని (అంటే అనధికారికంగానే) సంచలనం క్రియేట్ చేశారు. అయితే ఆయన ఎంట్రీతో విశాఖ సౌత్ వైసీపీలో గందరగోళం నెలకొంది. ద్రోణంరాజు శ్రీనులతో పాటు కోలా గురువులు క్యాడర్ తీవ్ర ఆందోళనలో పడిపోయింది.
వాసుపల్లి వైసీపీకి జైకొట్టక ముందు సౌత్ మొత్తం ద్రోణం రాజు, కోలా గురువుల నాయకత్వంలో నడిచేది. ద్రోణంరాజు మరణంతో కోలా గురువులే పెద్దయ్యారు. ద్రోణంరాజు కుమారుడికి పార్టీ అండగా నిలబడుతుందని చెప్పినా కోలా గురువులదే పైచేయిగా ఉంటుందని అంతా అనుకున్నారు. జీవీఎంసీ ఎన్నికల్లో మొదటి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ద్రోణంరాజు, కోలా గురువుల అనుచరులకే పార్టీ తరపున కార్పొరేటర్ల టికెట్లు దక్కాయి. కానీ ఆ ప్రక్రియ నిలిచిపోయింది. ఆతర్వాత వాసుపల్లి వైసీపీలోకి వచ్చారు. మళ్ళీ వచ్చే నెల 3 నుండి ఎన్నికల ప్రక్రియను తిరిగి ప్రారంభించనున్నట్టు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చింది. ఇక్కడే వాసుపల్లి తన ప్రతాపం చూపుతున్నారు.
గతంలో టికెట్లు పొందిన ద్రోణంరాజు, కోలా గురువుల అనుచరులను కాదని తన మనుషులకే టికెట్లు ఇప్పించే ప్రయత్నం చేస్తున్నారని, గతంలో తనకు వ్యతిరేకంగా పనిచేసిన వారిని పోటీ నుంచి తప్పించాలని భావిస్తున్నట్టు పార్టీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. 29, 30, 34, 35, 36, 37 38 వార్డుల్లో క్యాండెంట్లను మార్చాల్సిందిగా ఆయన అధిష్టానాన్ని కోరారట. దీంతో గతంలో నామినేషన్లు వేసినవారు ద్రోణంరాజు కుటుంబం వద్ద, కోలా గురువుల సమక్షంలో తమ బాధలు చెప్పుకుంటున్నారట. ప్రచారానికి పేద మొత్తంలో ఖర్చుపెట్టుకున్నామని, ఇప్పుడు పోటీ నుండి తప్పిస్తే ఎలా అని వాపోతున్నారట. నియోజకవర్గంలో తమ ప్రాభవం లేకుండా చేస్తున్న వాసుపల్లి ప్రయత్నాల పట్ల ద్రోణంరాజు ఫ్యామిలీ, కోలా గురువులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారట. ఈ ఎఫెక్ట్ విశాఖలో వైసీపీకి మంచిది కాదని అంటున్నారు పార్టీ శ్రేణులు.