విశాఖలో టీడీపీ, జనసేన చెరిసగం.! కండిషన్స్ అప్లయ్.!

వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోయే నియోజకవర్గాల విషయమై, తెలుగుదేశం పార్టీ – జనసేన పార్టీ.. అంతర్గతంగా సమీక్షించుకుంటున్నాయి.. అదీ విడివిడిగా. ఎవరెవరి బలాబలాలెంత.? అన్నదానిపై ఇరు పార్టీలూ విడివిడిగా విశ్లేషించుకోవడంలో వింతేముంది.? విడివిడిగా చేసుకునే విశ్లేషణల అనంతరం, కలిసి కూర్చుని చర్చించుకోవడమెలాగూ వుంటుంది.

2024 ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలన్న నిర్ణయానికే టీడీపీ, జనసేన వచ్చేశాయ్. అధికారిక ప్రకటన రావాల్సి వుందంతే. ప్రస్తుతానికైతే, ప్రజా సమస్యలపై కలిసి పోరాటం చేయాలని ఇరు పార్టీలూ భావిస్తున్నాయి. కానీ, ఆ కలిసి చేసిన పోరాటలే ఏంటో తెలియడంలేదు.

ఇంతకీ, బీజేపీ సంగతేంటి.? మిగతా చోట్ల సంగతెలా వున్నా, విశాఖ మీద కాస్తంత ప్రత్యేకమైన శ్రద్ధతో వుందిట బీజేపీ. విశాఖ ఎంపీ స్థానాన్ని బీజేపీ కోరుతోంది. టీడీపీ – బీజేపీ – జనసేన కలిసి పోటీ చేస్తే, విశాఖ ఎంపీ సీటు, బీజేపీకేనట.

ఇంకో అసెంబ్లీ నియోజకవర్గాన్ని కూడా బీజేపీకి ఇచ్చే అవకాశం వుందని టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, చెరిసగం సీట్లలో టీడీపీ – జనసేన పోటీ చేస్తాయట.

కాగా, విశాఖ ఎంపీ స్థానంపై జనసేన కూడా గట్టిగానే నిలబడుతోంది. గాజువాక సహా, పలు నియోజకవర్గాల్లో చాలా బలంగా వున్నామనీ, ఈ నేపథ్యంలో ఎంపీ సీటునీ గెలుస్తామనీ జనసేన అంటోందిట. టీడీపీ – జనసేన.. పోటీ చేసే సీట్ల పరంగా పంచేసుకుంటున్నాయ్ గెలుపు సంగతేంటి.? వైసీపీ పరిస్థితి స్థానికంగా ఎలా వుంది.?

విశాఖలో వైసీపీ అనూహ్యంగా దెబ్బ తిందని స్థానికంగా చర్చ జరుగుతోంది. టీడీపీ – జనసేన మధ్య సీట్ల పంపకాల్లో తేడాలొస్తే తప్ప, వైసీపీకి జిల్లాలో గడ్డు పరిస్థితేనట.!