వివేకా హత్య కేసులో భాస్కర్ రెడ్డి అరెస్ట్.!

మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో, వైఎస్ భాస్కర్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేసింది. తెలుగు రాష్ట్రాల్ని ఓ కుదుపు కుదిపేసింది 2019 ఎన్నికల సమయంలో వైఎస్ వివేకాందరెడ్డి దారుణ హత్య ఘటన. తొలుత గుండె పోటుగా ప్రచారం జరిగినా, చివరికి అది అత్యంత కిరాకతకమైన హత్యగా తేలింది.

2019 ఎన్నికల సమయంలో ఈ హత్య వైసీపీకి రాజకీయంగా ఉపయోగపడింది. టీడీపీ కూడా ఈ హత్యకేసుని అడ్డం పెట్టుకుని రాజకీయంగా లబ్ది పొందేందుకు ప్రయత్నించిదిగానీ, బొక్కబోర్లా పడింది.

నారాసుర రక్త చరిత్ర.. జగనాసుర రక్త చరిత్ర.. ఇలా ఆరోపణలు, ప్రత్యారోపణలు టీడీపీ – వైసీపీ మధ్య జరిగాయి. అనూహ్యంగా, వైఎస్ వివేకానందరెడ్డి మతం మార్చుకున్నారనీ, ముస్లిం మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని, ఆమె ద్వారా ఓ బిడ్డకు తండ్రి అయ్యారనీ, ఆ కారణంగా జరిగిన గలాటానే హత్యకు కారణమనీ వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ఇటీవల పెద్ద బాంబు పేల్చారు.

ఇంకోపక్క, సదరు ముస్లిం మహిళ కాకుండా, మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకోవడం వల్లే వివేకానందరెడ్డి హత్య జరిగిందని కూడా వైసీపీనే ఆరోపిస్తూ వచ్చింది. ఇంత గందరగోళం నడుమ, అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేయడం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది.

భాస్కర్ రెడ్డి స్వయానా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సతీమణి భారతీ రెడ్డికి మేనమామ. భాస్కర్ రెడ్డిని అరెస్టు చేసిన సీబీఐ, ఆయన్ని హైద్రాబాద్‌కి తరలిస్తోంది. హత్యకు కుట్ర భాస్కర్ రెడ్డి కేంద్రంగా జరిగిందన్నది ప్రస్తుతం ప్రముఖంగా వినిపిస్తోన్న వాదన.