ఆచూకీ చెబితే పదివేలు..పట్టిస్తే లక్ష రూపాయలు. ఇలాంటి రివార్డులు సాధారణంగా పోలీసులు నక్సలైట్ల మీద ఒకప్పుడు ప్రకటించేవారు. మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలైన గిరిజన గ్రామాల వీధుల్లో గోడల మీద పోస్టర్లు అంటించి ప్రకటనలు ఇచ్చేవారు. వాళ్ల ఆచూకీ తెలిసిన వారు..న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉన్నవారు.. ధైర్యం ఉన్న వాళ్లు ముందుకొచ్చి తమకు తెలిసిన విషయాన్ని చెప్పి ఆ రివార్డు అందుకునేవారు. మళ్లీ కొన్ని దశాబ్ధాల తర్వాత బెజవాడ నడిబొడ్డున దాదాపు అలాంటి పోస్టర్లు వెలిసే పరిస్థితి వచ్చిందా? అంటే వచ్చిందనే అనాలేమో. సరిగ్గా నిన్నటి రోజున విజయవాడ సీపీ ఇలాంటి ప్రకటనే చేసారు.
డాక్టర్ రమేష్- ముత్తవరపు శ్రీనివాస్ ల ఆచూకీ చెబితే లక్ష రూపాయలు నజరానా అందిస్తామని ప్రకటించారు. హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు, వైజాగ్ ఇలా ఎక్కడ వెతికినా ఇప్పటివరకూ వాళ్లు కానరాలేదని తెలిపారు. రమేష్ ఆసుపత్రి యాజమాన్యాన్ని, స్వర్ణ ప్యాలస్ యాజమాన్యాన్ని నక్సలైట్ల కన్నా ఘోరంగా ట్రీట్ చేస్తున్నారని ఈ ఒక్క ప్రకటన చెప్పకనే చెబుతుంది. రమేష్ ఆసుపత్రి నిర్వాకానికి 10 మంది అమాయకులు సజీవ దహనమైన సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగిన అనంతరం రమేష్-శ్రీనివాస్ లు ఎలాంటి వివరణ ఇవ్వకుండా పత్తా లేకుండా పోయారు. నాటి నుంచి పోలీసులు బృందాలు గా విడిపోయి గాలింపు చేపట్టినా దొరకలేదు.
ఐపీసీ సెక్షన్ 91 కింద నోటీసులు జారీ చేసి ప్రమేయం ఉన్న వారందర్నీ దొరికరిన వారిని దొరికినట్లు లోపలేస్తున్నారు. కరోనా పేరు చెప్పి కోట్ల రూపాయలు ఎలా సంపాదించారో నిన్నటి రోజునే సీపీ పూసగుచ్చారు. ఇక పోలీసుల అదుపులో ఉన్న వారు కూడా సరైన సమాచారం ఇవ్వడం లేదని, అయినా వాళ్ల నుంచి వివరాలు ఎలా రాబట్టాలో తమకు తెలుసునని ధీమా వ్యక్తం చేసారు. ఈ వ్యవహారంలో దూరిన నటుడు రామ్ కు చురకలంటించారు. విచారణ ఎలా చేపట్టాలో తమకు తెలుసునని, ఎవరు పని వాళ్లు చూసుకుంటే మంచిదని వ్యాఖ్యానించారు. పోలీసులకు కుల, మత, ప్రాంత బేధాలుండవని..చట్టం ముందు అందరూ సమానులేనని పేర్కొన్నారు. మరి ఈ నజరానా ఎవరు దక్కించుకుంటారో.