ముష్టి నాయుడు.! విజయసాయిరెడ్డి ‘అతి’ అధ్వాన్నం.!

Vijayasai Reddy'

విమర్శల స్థానంలోకి దూషణలు వచ్చేసి చాలాకాలమే అయ్యింది. అయితే, అవిప్పుడు మరింత దారుణంగా తయారయ్యాయి. సభ్య సమాజం హర్షించని భాషని రాజకీయ నాయకులు వినియోగిస్తున్నారు. కీలక పదవుల్లో వున్నవారు సైతం ఇందుకు అతీతమేమీ కాదు. ఎవరు ఎంతలా దిగజారిపోతే, వాళ్ళకి అంతలా పదవులు.. అన్నట్టు, రాజకీయ పార్టీల అధినేతలూ వ్యవహరిస్తున్నారు.

దాంతో, పదవుల కోసం ఏ స్థాయికి దిగజారిపోవడానికైనా రాజకీయ నాయకులు వెనుకాడ్డంలేదు. ఎందుకిలా.? అంటే, పదవి.. ఆ పదవి మీద యావ. అధినేత మెప్పు పొంది, రాజకీయంగా మరింత ఎదగాలన్న యావ.!

విద్యావంతుడు, రాజ్యసభ సభ్యుడు అయిన విజయసాయిరెడ్డి కూడా, తన స్థాయికి తగని మాటల్ని ఉపయోగిస్తున్నారు. సోషల్ మీడియాలో ఆయన భాష మరింత జుగుప్సాకరంగా వుంటోంది. శాపనార్థాల స్థాయికి ఆయన దిగజారిపోయారు. మరీ హేయంగా వ్యవహరిస్తున్నారు.

తాజాగా, సోషల్ మీడియా వేదికగా చంద్రబాబుపై విమర్శలు చేసే క్రమంలో విజయసాయిరెడ్డి వాడిన భాష అభ్యంతరకరంగా తయారైంది. ‘మట్టి, ఇసుక, బాక్సైట్, గ్రానైట్ అక్రమ తవ్వకాలే ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకున్న పచ్చ కుల పార్టీ అధికారం పోయాక దోపిడీకి అవకాశం కోల్పోయామని గంగవెర్రులెత్తుతోంది.. పన్ను చెల్లించకుండా గ్రానైట్ తరలించి వందల కోట్ల పన్నులు ఎగవేసిందెవరు?’ అన్నంతవరకూ విజయసాయిరెడ్డి ట్వీటుని తప్పు పట్టలేం.

కానీ, చివర్లో ‘ముష్టి నాయుడు బాబూ..’ అంటూ విజయసాయిరెడ్డి ముగించిన వైనం, దిగజారిపోయిన ఆయన స్థాయిని చెప్పకనే చెబుతోంది.

అంతకు ముందు మరో ట్వీటులో, ‘కోరికలు తీరకుండానే పోయిన ఆత్మ పిశాచి రూపంలో తిరుగుతుందని పెద్దలు చెబుతంటారు. ముసలి నక్క-73 బతికి వుండగానే భూతం అవతారం ఎత్తి జనాన్ని హింసిస్తున్నాడు. డెకాయిట్లు, భూ కబ్జాదారులను కాపాడటమే కర్తవ్యంగా పెట్టుకున్నాడు. బ్లాక్ మ్యాజిక్ స్లీపర్ సెల్స్ ఆయన బలం..’ అంటూ పేర్కొన్నారు.

ఎవరికి ప్రయోజనం ఈ ట్వీట్ల వల్ల. వైసీపీకి, రాజకీయంగా పావలా లాభం కూడా వుండదని విజయసాయిరెడ్డికి ఎలా అర్థమవుతుందో ఏమో.!