సంక్రాంతి పండుగ రోజు కూడా చంద్రబాబుని సంతోషంగా ఉండనివ్వకుండా చేస్తున్నారు వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి గారు. సంక్రాంతి సృష్టికర్తనని చెప్పుకునే చంద్రబాబు గారికి… చిత్తుగా ఓడిపోయి రెండేళ్లవుతున్నా ఎలా ఓడిపోయాడో తెలియదంట అంటూ విజయ సాయిరెడ్డి ఎద్దేవా చేశారు. దేవాలయాలు ధ్వంసం చేసి తన ఓటమికి ప్రజల్నే నిందిస్తున్నాడని విజయ సాయిరెడ్డి పేర్కొన్నారు. ‘నేనేం తప్పు చేశానో నాకు తెలియదు. నన్ను క్షమించండి. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే నేను చేసిన తప్పా’ అంటూ చంద్రబాబు వ్యాఖ్యలపై ఎంపీ విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు.

ఇప్పుడు కొత్తగా సారీ పూర్తిగా మారిపోయానంటూ డ్రామాలు మొదలెట్టారంటూ ఎంపీ విజయ సాయిరెడ్డి దుయ్యబట్టారు. అంతేకాదు ఎన్నిసార్లు మారతారు బాబు గారూ? అంటూ ఎంపీ ప్రశ్నించారు. ‘‘ అమూల్ రాకతో వరి పండించే రైతులే కాదు పాడి రైతులు కూడా అదనపు ఆదాయంతో ఆనందంగా ఉన్నారు. మరి రాష్ట్రం ఇచ్చిన జీవోలను భోగిమంటల్లో వేయమంటారేంటి చంద్రబాబు గారూ? హెరిటేజ్ కంపెనీ ఆదాయం తగ్గినా లక్షలాది రైతులకు లాభం జరిగిందిగా! రైతు బాగుపడితే మీకు అంత కడుపుమంట ఎందుకు?’’ అంటూ విజయ సాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రతిపక్షాలపై విమర్శలు చేయడంలో సీఎం జగన్ కంటే ఎంపీ విజయ సాయిరెడ్డే ముందుంటున్నారు. వైసీపీ పాలనపై టీడీపీ చేసే ఆరోపణలను కూడా విజయ సాయిరెడ్డే దీటుగా సమాధానం చెబుతున్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఆయన తనయుడు చేసే సవాళ్లుకు కూడా విజయ సాయిరెడ్డినే జవాబు చెబుతున్నారు. ఇటీవల రామతీర్థంలో విగ్రహాల ధ్వంసం ఘటనలోనూ ప్రతిపక్షాల ఆరోపణలకు ప్రభుత్వం తరపున విజయ సాయిరెడ్డి నిలబడి ఎప్పటికప్పుడు సమాధానం చెబుతూ వస్తున్నారు.