గోవా గవర్నర్‌గా అశోక్ గజపతిరాజు .. కీలక వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు, పవన్, లోకేష్..!

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మరోసారి కీలక నిర్ణయం తీసుకున్నారు. మూడు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆందులో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు, టీడీపీ నేత.. మాజీ కేంద్రమంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజుకు గోవా గవర్నర్‌ పదవి దక్కడం విశేషం. ఆయనతో పాటు హర్యానా గవర్నర్‌గా ప్రొఫెసర్ ఆషిమ్ కుమార్ ఘోష్, లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా కవీందర్ గుప్తా నియమితులయ్యారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అశోక్ గజపతిరాజును ట్విట్టర్ ద్వారా అభినందించారు. తెలుగుదేశం పార్టీ నేతలకు, కార్యకర్తలకు ఇది గర్వకారణమైన విషయమన్నారు.. గోవా గవర్నర్‌గా తన నేతకు అవకాశం కల్పించినందుకు పార్టీ శ్రేణులు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు, ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. గోవా గవర్నర్‌గా నియమితులైన అశోక్ గజపతిరాజుకి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఇది ఆంధ్రప్రదేశ్‌కి గర్వకారణమని అని ట్వీట్‌ చేశారు.

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కూడా అశోక్ గజపతిరాజుకు అభినందనలు తెలిపారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన ఆయన గవర్నర్‌గా రాజ్యాంగ పరిరక్షణ బాధ్యతలను విజయవంతంగా నిర్వహిస్తారని నమ్మకం ఉందని పేర్కొన్నారు. అలాగే ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ కూడా సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ‘‘అశోక్ గజపతిరాజు గారు గవర్నర్ కార్యాలయానికి గొప్ప గౌరవాన్ని తీసుకువస్తారని ఆశిస్తున్నాను’’ అని లోకేష్ చెప్పారు.

మరోవైపు ఇప్పటివరకు హర్యానా గవర్నర్‌గా పనిచేసిన బండారు దత్తాత్రేయ పదవీకాలం పూర్తయింది. ఆయన స్థానంలో కొత్తగా ఆషిమ్ కుమార్ ఘోష్ బాధ్యతలు చేపట్టనున్నారు. లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా కవీందర్ గుప్తా నియమితులవుతారు. సుదీర్ఘంగా రాజకీయ జీవితంలో విశేష సేవలందించిన అశోక్ గజపతిరాజు గోవా గవర్నర్‌గా పదవి చేపట్టనున్న సందర్భంలో తెలుగు ప్రజలు ఆయనకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ నియామకం రాష్ట్రానికి గౌరవాన్ని తీసుకువస్తుందనే నమ్మకం వ్యక్తమవుతోంది.