దేశంలో అత్యంత పేద సీఎం ఎవరో తెలుసా.. ఈ పేరు వింటే షాక్ అవుతారు..!

దేశ రాజకీయాల్లో ప్రముఖ నాయకుల ఆస్తుల విలువ ఎప్పుడూ జనాల్లో కుతూహలాన్ని రేకెత్తిస్తూనే ఉంటుంది. ముఖ్యంగా ప్రజలకు నాయకుల నిజమైన ఆర్థిక స్థితిగతులపై ఒక స్పష్టత ఇచ్చే నివేదికలు బయటకు వస్తే మరింత ఆసక్తికరంగా మారతాయి. తాజాగా అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ (ADR) విడుదల చేసిన తాజా విశ్లేషణ దేశంలోని ముఖ్యమంత్రుల ఆస్తుల స్థాయిని బహిర్గతం చేసింది. ఈ నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 931 కోట్లకు పైగా ఆస్తులతో దేశంలోనే అత్యంత ధనిక సిఎంగా నిలవగా, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కేవలం 15.38 లక్షల ఆస్తులతో అతి పేద ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన నాయకులు దాఖలు చేసిన అఫిడవిట్ల ఆధారంగానే ఈ లెక్కలు తీసుకున్నట్టు ఏడీఆర్ స్పష్టం చేసింది. అలా చూస్తే అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ రూ. 332 కోట్ల ఆస్తులతో రెండో స్థానంలో ఉండగా, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య రూ. 51 కోట్ల ఆస్తులతో మూడో స్థానంలో ఉన్నారు. దేశంలో మొత్తం 31 మంది ముఖ్యమంత్రుల కలిపిన ఆస్తుల విలువ రూ. 1630 కోట్లకు చేరుకున్నట్టు ఈ నివేదిక వెల్లడించింది.

ఇక మరోవైపు తక్కువ ఆస్తులు కలిగిన ముఖ్యమంత్రుల జాబితా మరింత చర్చనీయాంశంగా మారింది. అందులో మమతా బెనర్జీ మొదటి స్థానంలో నిలిచారు. 2021లో జరిగిన భోవానీపోర్ ఉప ఎన్నిక సందర్భంగా ఆమె సమర్పించిన అఫిడవిట్ ప్రకారం మొత్తం ఆస్తులు కేవలం రూ. 15.38 లక్షలు మాత్రమే. అదే సమయంలో 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను ఆమె ఆదాయ పన్ను రిటర్న్స్‌లో కూడా ఇదే మొత్తం చూపించారని ఏడీఆర్ పేర్కొంది. మమతా తర్వాత జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా రూ. 55.24 లక్షల ఆస్తులతో రెండో స్థానంలో ఉండగా, కేరళ సీఎం పినరయి విజయన్ రూ. 1.18 కోట్ల ఆస్తులతో జాబితాలో ఉన్నారు. ఆస్తుల విలువలో ఇంతటి విరుద్ధత ఉండటం రాజకీయ నాయకుల ఆర్థిక స్థితిగతులపై ప్రజల్లో కొత్త చర్చలకు దారితీస్తోంది.

విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, దేశంలో ముఖ్యమంత్రుల ఆస్తుల విలువలో ఈ స్థాయిలో వ్యత్యాసం రావడం ప్రజాస్వామ్యంలోని ఒక ప్రత్యేకతను తెలియజేస్తోంది. ఒకవైపు వేల కోట్ల ఆస్తులు కలిగిన నేతలు ఉంటే, మరోవైపు సాధారణ ఉద్యోగితో పోలిస్తే కూడా తక్కువ ఆస్తులు కలిగిన నేతలు ఉన్నారు. ఇదే ఈ నివేదికను మరింత ఆసక్తికరంగా మారుస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.