అంతర్వేదిలో లక్ష్మీ నరసింహస్వామి రథంను తగలబడటం ఇప్పుడు ఏపీలో సంచలనంగా మారింది. ఎవరు చేశారన్న దానిపై ఏపీ తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతుంది. భక్తులు ఇప్పటికే ధర్నాలు చేస్తున్నారు. ప్రభుత్వం ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తుందని భక్తులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో బీజేపీ నేతలు ముందుండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు, నినాదాలు చేస్తున్నారు. అలాగే ఈ విషయంపై టీడీపీ నేతలు, వైసీపీ నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఘటనపై ఇప్పుడు వైసీపీ నేత విజయసాయి రెడ్డి కూడా ఘాటుగా స్పందించారు. ఆ రధాన్ని దగ్ధం చేయించింది టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడేనన్నది విజయసాయిరెడ్డి ఆరోపణ.
అంతర్వేదిరథం దగ్ధం విషయానికొస్తే, తొలుత ఎవరో మతి స్థిమితం లేని వ్యక్తి ఈ ఘటనకు కారకుడని అధికార పార్టీ ప్రచారం చేసింది. ఆ తర్వాత, తేనె పట్టు కోసం కొందరు చేసిన ప్రయత్నం, రధం దగ్ధమయ్యేలా చేసిందన్నారు. ఇప్పుడేమో, తెలుగుదేశం పార్టీ అధినేత ఈ రధం దగ్ధం వెనుక సూత్రధారి.. అంటూ విజయసాయిరెడ్డి తేల్చారు.
“తునిలో రైలు, అమరావతిలో తోటలు తగలబెట్టించి, విజయవాడలో గుడులు కూల్చి, అమరేశ్వరుడి భూములు మింగి, పుష్కరాల్లో 7వేల కోట్లు ఆరగించి, దుర్గమ్మ గుడిలో క్షుద్ర పూజలు చేయించి, అంతర్వేదిలో రథానికి నిప్పు పెట్టించాడు. పాప భీతి, దైవ భక్తి ఏనాడూ లేనివాడు. ఆ బాబే హిందుత్వంపై దాడులకు మూలకారకుడు.” అని ట్వీట్ చేశారు. ఇలా ఒకరిపై ఒకరు వ్యాఖ్యలు చేసుకుంటూ దేవుడి విషయాన్ని కూడా రాజకీయం చేస్తున్నారు. దేవుడి విషయంలో ఈ రాజకీయ నాయకులు నిష్పక్షపాతంగా ఉండలేరా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై విచారణ జరుగుతుంది. విచారణ జరుగుతున్న సమయంలో ఇలా విమర్శలు చేయడం తగదని రాజకీయ పండితులు చెప్తున్నారు.