వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి షాక్ ఇచ్చారు రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు. మంగళవారం జరిగిన రాజ్యసభ సమావేశంలో మాట్లాడిన విజయసాయిరెడ్డి, ఇంకోసారి మాట్లాడటానికి అవకాశం ఇవ్వాల్సిందిగా చైర్మన్ ను కోరారు. సమయాభావం అవుతున్న కారణంగా మరొకసారి అవకాశం ఇవ్వటం కుదరదని, ఇంకా మాట్లాడాల్సిన వారికి అవకాశం ఇవ్వాలని సూచించారు వెంకయ్య నాయుడు.
దీనితో చైర్మన్ ఏకపక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారంటూ వ్యాఖ్యలు చేశారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. సభ నుండి వాకౌట్ చేస్తానంటూ హెచ్చరించారు. వెల్ లోకి వెళ్లి మరీ ఆందోళన చేశారు. ఆయన తీరుపై పలువురు నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటువంటి చర్యలు సబబు కాదని విజయసాయిరెడ్డికి సూచించారట.
బుధవారం సభ ప్రారంభం కాగానే…నిన్న సభలో ప్రవర్తించిన తీరుకు చైర్మన్ కు క్షమాపణ చెప్పారు వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి. ఏపీ సమస్యలపై మాట్లాడటానికి సరైన సమయం ఇవ్వలేదనే ఉద్దేశంతోనే నిన్న చైర్మన్ ను అగౌరవపరచేలా మాట్లాడానని తెలిపారు. చైర్మన్ తో అలా ప్రవర్తించినందుకు సారీ చెప్పారు. ఉద్దేశపూర్వకంగా అనలేదని అనుకోకుండా భావోద్వేగంలో పరుష పదజాలం వాడానని విచారం వ్యక్తం చేశారు విజయ సాయిరెడ్డి.
కానీ అతని క్షమాపణను అంగీకరించలేదు వెంకయ్య. దీనిపై డిస్కషన్ కొనసాగించే ఉద్దేశం లేదని, ఆయన చేసిన తప్పును సమర్ధించుకుంటూ పోవటానికి సమయం లేదని వెంకయ్య నాయుడు అన్నారు. నాకు అతనితో క్షమాపణలు చెప్పించుకోవాలని ఆసక్తి లేదన్నారు. వెంకయ్యనాయుడు మాటలకు గట్టి షాక్ తగిలినట్టే అయ్యింది వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి.