“అమ్మరాజ్యంలో – కడప రెడ్లు” సినిమాలో దర్శకుడు రాం గోపాల్ వర్మ.. టీడీపీ యువకిశోరం నారా లోకేష్ లాఉన్న ఒక పాత్రను సృష్టించి.. ఆయన పరువు తీసేప్రయత్నం చేశారని తెలుగు జనాల్లో ఒక టాక్ ఉంది! డైనింగ్ టెబుల్ పై అన్నంలో “పప్పు” వడ్డించే సీన్ చేసి.. ఇండా డ్యామేజ్ చేశారని అప్పట్లో కథనాలొచ్చాయి! ఆ సంగతులు అలా ఉంటే… వర్మ తీసాడని చెబుతున్న పరువుకు మించి లోకేష్ లెవెల్ ను వెడల్పు చేసేపనికి పూనుకున్నారు వంగవీటి రాధా! ప్రస్తుతం చినబాబు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చేస్తున్న సందడే ఇందుకు సాక్ష్యం!
నిన్నమొన్నటివరకూ టీడీపీ ని వీడుతున్నారని.. మార్చి 14న జనసేనలో చేరిపోబోతున్నారని కథనాలొచ్చిన అనంతరం… తాజాగా పాదయాత్రలో లోకేశ్ పక్కన ప్రత్యక్షమయ్యారు వంగవీటి రాధా! పార్టీ మారుతున్నారనే గాసిప్స్ వల్ల చినబాబుకి కోపం వస్తుందని.. క్లారిటీ ఇవ్వాలని వెళ్లారా? లేక, ఈసారైనా విజయవాడలో తాను కోరుకున్న నియోజకవర్గంలో పోటీచేసే వరాన్ని ప్రసాదించమని వేడుకోవడానికి వెళ్లారా అన్నది తెలియదు కానీ.. ఉన్నపలంగా పాదయాత్రలో ప్రత్యక్షమయ్యారు.. చినబాబు అడుగులో అడుగేశారు!
వంగవీటి రంగా లెగసీతో పాలిటిక్స్ లోకి వచ్చిన రాధా.. తన పొలిటికల్ కెరీర్ లో ఏనాడూ సరైన నిర్ణయాలు తీసుకోలేదని ఫీలవుతుంటారు రంగా ఫ్యాన్స్! ఎందుకంటే… అప్పటికప్పుడే జనసేన నాయకులతో కలిసి కనిపిస్తారు.. కాసేపటికి కొడాలి నాని, వల్లభనేని వంశీ వంటి వైసీపీ నేతలతో ఫోటోలకు ఫోజులిస్తుంటారు.. కానీ టెక్నికల్ గా ఆయన టీడీపీలో ఉన్నారు! అయితే… 2024 ఎన్నికల్లో ఆయన జనసేన గట్టున ఉంటారనే కథనాలొస్తున్న తరుణంలో… సడన్ గా లోకేష్ పాదయాత్రలో ప్రత్యక్షమవడం జరిగింది! ఫలితంగా పార్టీ మారుతున్నారనే గాసిప్స్ కి చెక్ పెట్టినట్లయ్యింది!
కాగా… తానుకోరుకున్న సీటు తనకు ఇవ్వలేదని వైకాపా నుంచి బయటకువచ్చేసిన రాధా టీడీపీలో చేరారు. కానీ, అక్కడ కూడా ఆ స్థానం నుంచి పోటీచేసే అవకాశం లేకపోవడంతో ప్రచారానికే పరిమితమయ్యారు. ఆయన ప్రచారం చేసిన ఏ ఒక్క చోటా టీడీపీ గెలవలేదనే కామెంట్ల సంగతి కాసేపు పక్కనపెడితే… తానింకా టీడీపీలోనే ఉన్నట్టు, ఉండబోతున్నట్టు తన అభిమానులకు, జనాలకు, టీడీపీ కార్యకర్తలకు ఈ పాదయాత్ర ఫోటోలద్వారా సిగ్నల్స్ మాత్రం ఇచ్చారు!
అయితే… రాధా, టీడీపీలోనే ఉండాలనుకోవడం.. అందులోనూ లోకేష్ తో కలసి పాదయాత్రలో పాల్గొనడం.. వంగవీటి అభిమానులకు ఏమాత్రం నచ్చడంలేదని కామెంట్లు పెట్టుకునేవారు పెట్టుకుంటున్నా… ఈ సంఘటన ద్వారా లోకేష్ లెవెల్ ని వంగవీటి వెడల్పు చేశారనేది మాత్ర వాస్తవం అంటున్నారు విశ్లేషకులు!