700 కోట్ల రూపాయల ఖర్చుతో, ఉద్దానం కష్టాన్ని తీర్చేందుకు చిత్తశుద్ధితోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రయత్నించారు. మంచి నీటిని అందించడం, అత్యాధునిక వైద్య సదుపాయాలతో కూడిన ఆసుపత్రిని ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం నిర్మించడం.. ఇవేవీ ఆషామాషీ వ్యవహారాలు కావు.
వాస్తవానికి, ఉద్దానం సమస్య నాలుగు దశాబ్దాల క్రితం నాటిది. అప్పటినుంచి ఎంతోమంది కిడ్నీ సమస్యల బారిన పడి ప్రాణాలు కోల్పోతూనే వున్నారు. ప్రపంచమే గుర్తించినా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఈ సమస్యని అంత సీరియస్‌గా తీసుకున్నట్లు ఇప్పటిదాకా కనిపించడంలేదు.
ముఖ్యమంత్రుల ప్రోటోకాల్స్ కంటే, అధికార పార్టీలు ప్రభుత్వం తరఫున ప్రకటనల పేరుతో చేసే ఖర్చుకుంటే.. ఉద్దానం సమస్యను తీర్చడానికి అయ్యే ఖర్చు ఎక్కువేమీ కాదు. కానీ, ఇన్నేళ్ళుగా.. ఎంతోమంది ముఖ్యమంత్రులు (వైఎస్ రాజశేఖర్ రెడ్డి సహా) ఉద్దానం సమస్యని లైట్ తీసుకున్నారు.
ఓ కేంద్ర మంత్రి, ఓ రాష్ట్ర మంత్రి, ఓ ఎంపీ, ఓ ఎమ్మెల్యే, ఓ ఎమ్మెల్సీ స్థాయిలో ఈ సమస్యను సీరియస్‌గా తీసుకున్నా, ఉద్దానం ఈ రోజు ఈ కిడ్నీ సమస్యతో ఇంకా బాధపడుతూ వుండేది కాదు.!
నాలుగున్నరేళ్ళ సమయం వైఎస్ జగన్ సర్కారుకి ఎందుకు పట్టింది.? అన్నదీ ఓ ప్రశ్నే. సరే, అయ్యిందేదో అయిపోయింది. ఇప్పటికైతే మంచి నీరు అందుబాటులోకి వచ్చింది. ఆసుపత్రి కూడా అందుబాటులోకి వచ్చింది. వాస్తవానికి, మంచి నీటి సమస్య, టీడీపీ హయాంలోనే సద్దుమణిగిందనుకోండి.. అది వేరే సంగతి.
తేలాల్సింది, ఆ కిడ్నీ సమస్య ఎలా వచ్చిందని.? ఉద్దానంలో కిడ్నీ బాధితులు ఎక్కువగా వున్నారు. నిజానికి, శ్రీకాకుళం జిల్లాలోనే ఈ కిడ్నీ సమస్య ఎక్కువగా వుంది. అదెందుకు బయటకు రావడంలేదు.? సమస్య మూలాలు ఎందుకు వెలుగుచూడ్డంలేదు.?
ఈ ప్రశ్నలకు సమాధానం వెతుకుతోంది ఉద్దానం ప్రాంతం.! ఆ సమాధానం చెప్పగలిగితే తప్ప, వైఎస్ జగన్‌ని అయినా, ఇంకో ముఖ్యమంత్రిని అయినా ఉద్దానం ప్రాంతం నమ్మే అవకాశమే లేదు.!