ఒకరు కాదు.! ఇద్దరట.! ఔను, ఇద్దరు వైసీపీ ఎంపీలు, జనసేన పార్టీలో దూకేందుకు సుముఖంగా వున్నారట.! ఏంటీ, నిజమేనా.? అంటే, రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే.! 2024 ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి పోటీ చేసేందుకు సదరు ఎంపీలు సమాయత్తమవుతున్నారట.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కాదని, జనసేన పార్టీతో టచ్‌లోకి వెళ్ళేంత సాహసం చేసే ఆ వైసీపీ ఎంపీలెవరబ్బా.? అని, వైసీపీ వర్గాలు కూడా ఆరా తీస్తున్నాయి. గతంలో, జనసేనానితో అత్యంత సన్నిహిత సంబంధాలు వుండేవట ఆ ఇద్దరు ఎంపీలకీ.! మొన్నీమధ్యనే, జనసేన అధినేతతో ఆ ఇద్దరు ఎంపీలూ విడివిగా.. రహస్యంగా భేటీ అయ్యారన్న గుసగుసలూ వినిపిస్తున్నాయి.
వైసీపీ మాత్రం, ఈ ప్రచారాన్ని తిప్పి కొడుతోంది. వైసీపీ నుంచి ఎంపీలెవరూ, ఇతర పార్టీలతో టచ్‌లో లేరనీ, నర్సాపురం ఎంపీ మాత్రం, వైసీపీకి చాలా కాలం నుండీ దూరంగా వుంటున్నారనీ, ఆయనకీ తమ పార్టీకీ సంబంధం లేదని వైసీపీ చెబుతోంది.
‘మా పార్టీతో టచ్‌లోకి వచ్చారు చాలామంది వైసీపీ ఎమ్మెల్యేలు..’ అని టీడీపీ చెప్పడం చూశాం. కొందరు ఎమ్మెల్యేల విషయంలో జనసేన కూడా ఇలాగే చెబుతోంది. అయితే, ఇంతవరకు ఒక్క ఎమ్మెల్యే కూడా జనసేనతో టచ్‌లోకి వెళ్ళలేదు వైసీపీ నుంచి. అలాంటిది, ఎంపీలు ఎలా జనసేన వైపు వెళ్ళేందుకు ప్రయత్నిస్తారట.?
ఆయా నియోజకవర్గాల్లో స్థానిక నాయకత్వం నుంచి ఒత్తిడి పెరుగుతోందనీ, అనుచరులు తెస్తున్న ఒత్తిడితోనే, ఆ ఎంపీలు పార్టీ మారాలనీ, అందునా జనసేన వైపుకు వెళ్ళాలనుకుంటున్నారనీ, లీకులైతే బయటకు వచ్చాయి. అందులో.. అంటే, ఆ ఇద్దరిలో ఒకరు మహిళా ఎంపీ.. అని కూడా అంటున్నారు.