అదేంటీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో లోక్ సభకు పోటీ చేయించాలని కదా, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ప్రయత్నిస్తున్నది.? ఇంతలోనే, నారా లోకేష్ విషయంలో ఈ లోక్ సభ ప్రతిపాదన ఎందుకు వస్తున్నట్లు.?
పవన్ కళ్యాణ్‌కి అయితే ఇబ్బందేమీ లేదు. అసెంబ్లీకీ, లోక్ సభకీ.. రెండిటికీ పోటీ చేసే వెసులుబాటు ఆయనకు వుంటుంది. 2019 ఎన్నికల్లో ఆయన రెండు అసెంబ్లీ స్థానాలకు పోటీ చేశారు. అప్పట్లో రెండు చోట్లా ఆయన ఓడిపోయినా, ఈసారి రెండు చోట్ల పోటీ చేస్తే, రెండు చోట్లా జనసేనాని పవన్ కళ్యాణ్ గెలిచే అవకాశాలైతే మెండుగా వున్నాయి. అది వేరే సంగతి.
వాస్తవానికి, మంగళగిరి నియోజకవర్గం నుంచి నారా లోకేష్ అసెంబ్లీకి పోటీ చేయాల్సి వుంది. కానీ, ఏమయ్యిందో.. నియోజకవర్గ మార్పు సహా, అసెంబ్లీకి కాకుండా లోక్ సభకు అయితే బెటర్.. అన్న ఆలోచనల చుట్టూ చర్చ జరుగుతోందట తెలుగుదేశం పార్టీలో.
అసలు, ఈ ప్రస్తావన టీడీపీలో ఎందుకు వస్తోంది.? అన్న విషయమై తెలుగు తమ్ముళ్ళు ఒకింత అయోమయానికి గురవుతున్నారట. అబ్బే, ఇదంతా బయట ఎవరో పుట్టిస్తున్న పుకారు అని కొందరు, టీడీపీలోనే అంతర్గతంగా ఈ చర్చ జరుగుతోందనీ, లీకుల రూపంలో బయటకు వస్తోందని ఇంకొందరు అంటున్నారు.
రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు.. అది వేరే సంగతి. సీనియర్ల ఒత్తిడి నేపథ్యంలోనే, నారా లోకేష్‌ని లోక్ సభకు పంపాలని చంద్రబాబు అనుకుంటున్నారా.? అంటే, ఏమో.. ఔననే అనుకోవాలేమో.
ఆ మధ్య చంద్రబాబు కూడా లోక్ సభకు పోటీ చేస్తారన్న ప్రచారం తెరపైకొచ్చింది. కాదు కాదు, లోక్ సభకి కూడా.. అన్న ప్రచారం జరిగింది. గెలుపుపై నమ్మకం లేనప్పుడే, ఇలాంటి ‘రెండు ప్రస్తావనలు’ చేస్తుంటారు.
అన్నట్టు, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసిన కేసీయార్ కూడా ఓ చోట ఓడిపోయారు. రేవంత్ రెడ్డి కూడా ఓ చోట ఓడిపోయారు. మరీ దారుణమేంటంటే, రెండు చోట్ల పోటీ చేసిన ఈటెల రాజేందర్, రెండు చోట్లా ఓడిపోవడం.