రాధా ఆలోచన అలా ఉంటే…జగన్ నిర్ణయం దానికి పైఎత్తు

విజయవాడ సెంట్రల్ సీటు విషయం రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ అయింది. సెంట్రల్ సీటు విషయంపై అటు వైసీపీ అధిష్టానం, ఇటు వంగవీటి మధ్య టగ్ ఆఫ్ వార్ నడుస్తోంది. మంగళవారం వైసీపీ అధికార ప్రతినిధి ఈ మేర ఒక ప్రకటన కూడా చేశారు. సెంట్రల్ సీటు మల్లాది విష్ణుకి ఫిక్స్ చేసినట్టు స్పష్టం చేశారు. విజయవాడ తూర్పు లేదా బందరు పార్లమెంటు నియోజకవర్గం నుండి రాధా పోటీ చేస్తానంటే అధిష్టానానికి అభ్యంతరం లేదన్నారు. సెంట్రల్ సీటు విషయంలో ఇటు జగన్ అటు రాధా ఇద్దరు తగ్గకపోవడానికి పలు ఆసక్తికర కోణాలు ఉన్నాయి.

రాధా విషయంలో అధిష్టానం ఎందుకు తగ్గట్లేదంటే…

2014 ఎన్నికల్లో తూర్పు నుండి ఓటమి పాలైన రాధాను సెంట్రల్ నియోజకవర్గం ఇంచార్జిగా నియమించింది అధిష్టానం. సో…2019 లో సెంట్రల్ సీటు రాధాకే అని ఆయన వర్గీయులంతా ఫిక్స్ అయిపోయారు. కానీ మల్లాది ఎంట్రీతో సీన్ రివర్స్ అయింది. వారి ఆశల్లో నీళ్లు చల్లినట్టు అయింది. లేట్ ఎంట్రీ అయినా జగన్ మెచ్చిన లేటెస్ట్ క్యాండిడేట్ మల్లాది.

ఏడాది క్రితం పార్టీలో చేరిన మల్లాది విష్ణు వైసీపీ నగర వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులయ్యారు. అయినా ఆయన దృష్టి మొత్తం సెంట్రల్ పైనే నిమగ్నం చేశారు. సెంట్రల్ లో పట్టు సాధించేలా వివిధ కార్యక్రమాలు చేశారు. ఆయనతోపాటు కాంగ్రెస్ నుండి వైసీపీలో చేరిన నేతలకు రాష్ట్ర, నగర స్థాయిలో పదవులు వేయించుకున్నారు. కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులుగా పని చేసిన వారిని సెంట్రల్ నియోజక వర్గం 20 డివిజన్లలో కో-ఆర్డినేటర్లను చేశారు. ఈ విధంగా సెంట్రల్ లో తన బలం పెంచుకున్నారు.

విజయవాడలో వంగవీటి కుటుంబానికి మంచి క్రేజ్ ఉంది. అయినప్పటికీ గత ఎన్నికల్లో విజయవాడ తూర్పు నుండి పోటీ చేసి రాధా పరాజయం పాలయ్యారు. దీంతో వంగవీటి మోహన్ రంగ క్రియేట్ చేసిన మార్క్ ని కొనసాగించడంలో రాధా విఫలమైనట్టే. విజయవాడ రాజకీయాలకి వంగవీటి కుటుంబం పెట్టింది పేరు. అటువంటిది సొంత నియోజక వర్గంలో సైతం రాధా ఓడిపోవడం అతని సామర్ధ్యం పై కించిత్ ఆలోచింపచేసేలా చేసింది. పీకే సర్వేలో కూడా రాధా వీక్ గా ఉన్నారని తేలినట్లు సమాచారం.

విజయవాడ ఆంధ్రా రాజధాని, అందునా టీడీపీ కంచుకోట. మరి ఆ కంచుకోటను బద్దలుకొట్టి సీటు గెలవాలంటే బలమైన అభ్యర్థి కావాలి. ఆ సీటు గెలవటం ప్రతిష్టాత్మకం కీలకం కూడా… మరి ఈ విషయంలో జగన్ కూడా ఛాన్స్ తీసుకోదలుచుకోలేదు. జగన్ ఆలోచన సీఎం కావటమే కాదు టీడీపీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో కూడా వైసీపీ పట్టు సాధించడం. అందుకే అంగ బలం, ఆర్ధిక బలం, సామజిక బలం ఉన్న అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు.

విజయవాడ సెంట్రల్ లో బ్రాహ్మణ సామజిక వర్గం అధికం. మల్లాది విష్ణు అదే సామాజిక వర్గానికి చెందినవాడు పైగా… విశాఖపట్నంలో జరిగిన ఆత్మీయ సదస్సులో సైతం బ్రాహ్మణులు తమ సామజిక వర్గానికి చెందిన వారికే సెంట్రల్ టికెట్ ఇవ్వాల్సిందిగా కోరారుట. ముందు నుండి మల్లాది విష్ణుకి టికెట్ ఇవ్వాలనే ఆలోచనలో ఉన్న జగన్ వారి అభ్యర్ధనతో ఏకీభవించారు. మల్లాదికే సీటు కేటాయించారు.

జగన్ అభిలషించినట్టు ముఖ్యమంత్రి అవ్వాలంటే ప్రతి సీటు కీలకం. గత ఎన్నికల్లో జరిగిన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఆచి తూచి అభ్యర్థుల ఎంపిక చేస్తున్నారు. ఎటువంటి ఒత్తిడులున్నా వెనక్కి తగ్గట్లేదని తెలుస్తోంది. ఇప్పుడు రాధా విషయంలో కూడా ఆయన అంతే దృఢంగా ఉన్నారట జగన్. రాధా వర్గాలు ఇంత ఆందోళన చేస్తున్నా జగన్ స్పందించలేదు. దీంతో రాధా విషయంలో ఇష్టమైతే ఉండు లేదంటే వెళ్లిపోవచ్చు అనే తీరు కూడా కనబరుస్తున్నారని రాజకీయవర్గాల్లో టాక్.

విజయవాడ సెంట్రల్ సీటే కావాలని రాధా ఎందుకు పట్టుబట్టాడు?

విజయవాడ సెంట్రల్ సొంత నియోజక వర్గం. అందునా రాజధాని. 100 బందర్లు కలిపినా విజయవాడ కాలేవు. అతిపెద్ద కమర్షియల్ ఏరియా. వ్యాపార సామ్రాజ్యానికి కూడా అన్నివిధాలా అనువైనది. అక్కడ ఓడిపోయినా కిక్కుంటుంది. ఎందుకంటే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఒక ప్రెస్టీజియస్ సీటు. తన తండ్రి కాలం నుండి రాజకీయంగా చక్రం తిప్పిన విజయవాడ వదిలి వేరే చిన్న నియోజకవర్గాల్లో పోటీ చేయడం అంటే రాధా పొలిటికల్ ఇమేజ్ డ్యామేజ్ అయినట్టే.

సెంట్రల్ నియోజక వర్గంలో ఓడినా అభ్యర్థి పవర్ తగ్గదు. వంగవీటి పొలిటికల్ ఇమేజ్ కొనసాగించాలి అంటే  ఓడినా గెలిచినా రాధా అదే స్థానంలో నిలబడాలి. పైగా సెంట్రల్ నియోజకవర్గ ఇంచార్జి గా ఉండి అక్కడ సీటు లభించకపోవడం అంటే ఆయనకీ అవమానమే, అనుచరుల ముందు తలతీసేసినట్లే. అందుకే ఓడిపోయినా పర్లేదు కానీ అక్కడి నుండే పోటీ చేయాలి అనుకుంటున్నాడు రాధా. కానీ అధిష్టానం మాత్రం తేల్చి చెప్పేసింది. ముఖ్యంగా ఆయన విజయవాడ వదలి బయటకు వెళ్లేందుకు ఒప్పుకున్నా,  ఆయన అభిమాన సైన్యం మాత్రం దానికి సిద్ధంగా లేదు. ఎందుకంటే, వాళ్లకి సిటిలో గాడ్ ఫాదర్ లేకుండా పోతుంది.

దీనిపై రాధా తన కుటుంబ సభ్యులు, అనుచర గణంతో కలిసి చర్చించుకున్నారట. అధిష్టానం నుండి స్పష్టమైన నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు. రాని పక్షంలో రెండు రోజులు తర్వాత తన భవిష్యత్ కార్యాచరణపై ప్రకటించనున్నారు రాధా. పార్టీ నుండి బయటకి రావడం జరిగితే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలనీ నిర్ణయించుకున్నట్టు అనుచరులు తెలుపుతున్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాలు తిరిగి ప్రచారం చేస్తామని తెలిపారు రాధా అనుచర వర్గం.